తెలంగాణ

telangana

ETV Bharat / city

నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ఏపీ ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం... - 3 రాజధానులకు లైన్ క్లీయర్ వార్తలు

వివిధ మలుపులు తిరిగిన ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆమోదం తెలిపారు. కొన్ని నెలలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయిందీ బిల్లు. రెండుసార్లు సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోలేకపోయిన ఏపీ ప్రభుత్వం... బంతిని గవర్నర్​ కోర్టులోకి నెట్టేసి ఆయన ద్వారా విజయం సాధించింది. కొన్ని నెలలుగా సాగిన వివాదంలో ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది.

amaravathi issue
amaravathi issue

By

Published : Jul 31, 2020, 7:54 PM IST

రాజ్యాంగంలోని 197వ అధికరణ క్లాజ్‌-2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రభుత్వం రెండోసారి సభలో ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత మండలి సాధారణ అనుమతిగా పరిగణిస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.

అసలు ఏం జరిగిందంటే...

సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ ముందు ఉంచింది. వైకాపాకు ఆధిక్యం ఉన్న శాసనసభలో సులభంగానే బిల్లులు ఆమోదం పొందాయి. కానీ మండలికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. ఈ బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షం ససేమిరా అంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రూల్‌-71 తీర్మానంతో పైచేయి సాధించింది. ఈ తీర్మానం నెగ్గడంతో ఈ రెండు బిల్లులపై సభలో ప్రస్తావన రాకుండానే సమావేశాలు ముగిశాయి.

ఈ చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆ దస్త్రం కేంద్రం వద్దే పెండింగ్​లో ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోలేదు. ఈ బిల్లుల విషయమై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతలో బడ్జెట్​ సమావేశాలు రానే వచ్చాయి. మూడు రోజులే జరిగిన ఈ సమావేశాల్లో చాలా బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది.

వీటితోపాటే మరోసారి సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లును కూడా ప్రభుత్వం మండలి ముందుకు తీసుకొచ్చింది. ఆఖరి రోజున ద్రవ్యవినిమయ బిల్లు సహా ఈ రెండు బిల్లులను మండలి ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. ముందుగా ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదించుకోవాలని... అనంతరం ఈ రెండు బిల్లుల అంశాలను ఆలోచించాలని సూచించాయి. ముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లు సహా సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదు. అనంతరం ఉభయసభలు నిరవధిక వాయిదాపడ్డాయి. దీంతో గవర్నర్​ వద్దకు ఈ బిల్లులను పంపించి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ రెండు బిల్లులను గవర్నర్​ వద్దకు పంపించింది.

3 వారాల క్రితం గవర్నర్ వద్దకు బిల్లులను ప్రభుత్వం పంపింది. బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన గవర్నర్‌... రాజముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details