జీహెచ్ఎంసీ పరిధిలో పేద ప్రజల కోసం ప్రభుత్వం లక్ష రెండు పడక గదుల నిర్మించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గ్రేటర్‌లో 9వేల 714 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో ఇప్పటికే 79వేల 582 ఇళ్ల నిర్మాణం పూర్తైందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి 754 ఇళ్లను అర్హులకు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 58.50 కోట్ల వ్యయంతో 4 ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను ఈనెల 26వ తేదీ నుంచి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అర్హులకు అప్పగించనున్నారు. రాంగోపాల్ పేట్‌లోని అంబేడ్కర్ నగర్‌లో 28.05 కోట్లతో నిర్మించిన 400 ఇళ్లను ఈనెల 26న పంపిణీ చేస్తారు. పొట్టిశ్రీరాములు నగర్‌లో 14.01 కోట్లతో నిర్మించిన 162 ఇళ్లను ఈనెల 28న అందిస్తారు. జీవైరెడ్డి నగర్‌లో 15.57 కోట్లతో నిర్మించిన 180 ఇళ్లను జులై 1న.... గొల్లకొమరయ్య కాలనీలో 85 లక్షలతో నిర్మించిన 12 ఇళ్లను జులై 5న అర్హులైన పేదలకు ఇవ్వనున్నారు.
నెలాఖరు నుంచి గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభం - గ్రేటర్ హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను... పేదలకు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెలఖారు నుంచి దశల వారీగా ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఈనెల 26, 28, జులై 1, 5 తేదీల్లో మొత్తం 754 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... పంపిణీ చేయనున్నారు.
నిర్మాణం పూర్తైన మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను దశలవారీగా లబ్ధిదారులకు అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నిధులు లేక, మౌలిక వసతులు కల్పించక కేవలం 12 ప్రాంతాల్లో ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా మిగిలిన చోట్ల పంపిణీ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. వీటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రెండు పడక గదుల ప్రారంభోత్సవాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... హోంమంత్రి మహమూద్ అలీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉపసభాపతి పద్మారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ తదితరులు పాల్గొననున్నారు.