అనుకున్నారు.. సాధించారు.. ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. - మౌలాలి ఆర్‌పీఎఫ్ బెటాలియన్ వార్తలు
పెళ్లైతే ఇక వంటింటికే పరిమితం అనుకోలేదు అమ్రిత్‌సింగ్.. తండ్రి లేని బిడ్డ పెళ్లిచేసేయండి అన్నా పట్టించుకోలేదు అనూష... తన తండాలో చుట్టూ అవిద్య ఉన్నా వాటిపై పోరాటమే చేసింది రేణుక.. వీళ్లంతా ఇప్పుడు రైల్వే పోలీసులయ్యారు. తమలాంటి ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. మౌలాలిలోని ఆర్‌పీఎఫ్ 7వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా 298మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. దేశంలోని 13జోన్లకు చెందిన మహిళలు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకోవడం ప్రత్యేకత...
rpf battalion
By
Published : Aug 18, 2020, 9:29 AM IST
అన్నయ్య ఆశలని నెరవేర్చా...
నాన్న సింగరేణి కార్మికుడు, అమ్మ గృహిణి. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాక నాన్న అనారోగ్యంతో మరణించారు. అప్పటికి నేను ఐదోతరగతి చదువుతున్నా. దాంతో అన్న ఇంటర్‌తో చదువు ఆపేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తను ఎంతకష్టపడైనా సరే నన్ను బాగా చదివించాలనుకున్నాడు. ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. అందుకోసమే ప్రిపేర్ అవుతున్నా. కానీ బంధువులంతా ఇంకా చదువులెందుకు? పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయ్ అని అన్నతో చెప్పారు. కానీ అన్న పట్టుబట్టి చదివించాడు. తను ఓ పెట్రోల్ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తూ నాతో ఎమ్మెస్సీ పూర్తి చేయించాడు. తన కష్టాన్ని వృథాపోనివ్వకూడదనుకున్నా. ఈలోగా ఆర్‌పీఎఫ్‌లో మహిళా కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేశా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి కొంత సాయంగా నిలబడతున్నందుకు సంతోషం వుంది. త్వరలోనే ఐఏఎస్ లక్ష్యాన్నీ చేరుకుంటా.
- పొదిల అనూష, కుమురం భీం జిల్లా
బాబు గుర్తొచ్చి మధ్యలోనే వచ్చేయాలనుకున్నా!
చదువంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్‌తో చదువు ఆపేయాల్సి వచ్చింది. అమ్మానాన్నలకు ఒక్కగానొక్క ఆడపిల్లని కావడంతో పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకుని వివాహం చేసేశారు. బాబు పుట్టాడు. చదువుకోవాలని ఉందనే నా తపన మాత్రం అలాగే మిగిలి ఉంది. అదే విషయాన్ని మా వారితో చెప్పా. దాంతో డిగ్రీలో అడుగు పెట్టాను. 80శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేశాను. ‘చదువుకోవాలన్న నీకోరిక తీరింది కదా! ఇక ఇంటిపట్టునే ఉండి బాబును చూసుకో’మని అత్తమామలతోపాటు తల్లిదండ్రులూ సూచించారు. కానీ పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా పుస్తకాలు తెచ్చి ప్రోత్సహించారు మావారు. 2019 జనవరి ముంబయిలో జరిగిన ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యాను. దీంతో బాబుని తల్లిదండ్రుల వద్దకు పంపేసి శిక్షణకు వచ్చేశా. మొదట్లో బాబు గుర్తొచ్చి మధ్యలోనే వెళ్లిపోవాలనుకున్నా. కానీ నేను చదివేందుకు పడిన ఇబ్బందులు నా కొడుకు పడకూడదనే...నా బాధను ఎనిమిది నెలల పాటు దిగమింగుకుని శిక్షణ పూర్తి చేసుకున్నా.