తెలంగాణ

telangana

ETV Bharat / city

హైటెక్ సిటీలో కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత - కొండాపూర్ ప్రభుత్వాసుపత్రి తాజా సమాచారం

హైటెక్‌ సిటీలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతోంది. మరో 30 మంది ఆసుపత్రిపాలయ్యారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 57కి చేరింది. వారిలో 13 మంది చిన్నారులు, గర్భిణీ, ముగ్గురు వృద్ధులు ఉన్నారు. నీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సృజన తెలిపారు.

Contaminated water
కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బస్తీవాసులు

By

Published : Apr 8, 2022, 4:14 PM IST

Updated : Apr 8, 2022, 9:12 PM IST

మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థత గురైన వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి దాదాపు 27 మంది వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో కొండాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తాజాగా వారి సంఖ్య 57కి చేరింది. బాధితులందరూ జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వారిలో 13 మంది చిన్నారులు, గర్భిణీ, ముగ్గురు వృద్ధులు ఉన్నట్లు తెలిపారు.

కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత

కావూరిహిల్స్‌ నీటి రిజర్వాయర్‌ నుంచి పైపులైను ద్వారా రోజు విడిచి రోజు వడ్డెర బస్తీకి నీటిని సరఫరా చేస్తున్నారు. 3 నెలలుగా మురుగు కలుస్తోందని, దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కలుషిత నీటి వల్లే గతంలో ఒకరు చనిపోయారని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకీ కలుషిత నీరే కారణమని కాలనీ వాసులు వాపోతున్నారు.

'పరిస్థితి తెలుసుకొని నిన్న రాత్రి కాలనీలో పర్యటించాను. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేని వారిని ఆసుపత్రికి తరలించాం. జలమండలి అధికారులు, వైద్య బృందం కాలనీలో పర్యటించి నీటి నమూనాలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేయకుండా పరిస్థితి మెరుగు పరిచేందుకు కృషి చేయాలి.' -జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్

ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని లేదని.. మెరుగైన వైద్యం అందిస్తున్నామని కొండాపుర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వరదాచారి తెలిపారు. బాధితుల అస్వస్థతకు కారణం వైద్య పరీక్షల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. నీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సృజన తెలిపారు. ఇది జలమండలి నిర్లక్ష్యమని భాజపా నేత రవికుమార్‌ యాదవ్‌ అన్నారు. అయితే కలుషిత నీరు సరఫరా లేదని జలమండలి శేరిలింగంపల్లి జీఎం రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి:వ్యాయామం చేసి ఇంటికి వచ్చాక కుప్పకూలిన జవాను.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే!

Last Updated : Apr 8, 2022, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details