తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ మున్సిపాలిటీ ఏర్పాటుకు 5గురు అనుకూలం.. 22 గ్రామాలు వ్యతిరేకం - Municipal Corporation merger

Amaravati Gram Sabha's: అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుపై గ్రామసభలు ముగిశాయి. 6 రోజులపాటు 22 గ్రామసభలు జరగ్గా.. అన్నిచోట్లా మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ది చేయాలని తెలిపాయి. మున్సిపాల్టీ ఏర్పాటుతో తమకు ఒరిగేదేమి లేదంటూ ఏపీ ప్రభుత్వ ఎత్తుగడను రాజధాని గ్రామాల ప్రజలు తిప్పికొట్టారు.

AMARAVATI
AMARAVATI

By

Published : Sep 18, 2022, 10:48 AM IST

ఏపీలోని అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించింది. గ్రామసభల ఏర్పాటు ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కలిపి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసి గ్రామసభలు ఏర్పాటు చేసింది. రెండు నెలల కిందటి నుంచి మహాపాదయాత్రకు రైతులు సన్నద్ధమవుతుండగా.. అదే రోజు నుంచి ఏపీ ప్రభుత్వం గ్రామసభలను ప్రారంభించింది.

ఏపీ ప్రభుత్వ ఉద్దేశం ఏమైనప్పటికీ రాజధాని రైతులు.. మరోసారి పట్టుదలను, ఐకమత్యాన్ని చాటిచెప్పారు. 22 గ్రామాల్లోనూ అధికారులు సభలు నిర్వహించగా.. అన్ని గ్రామాల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు. బోరుపాలెంలో ఇద్దరు, లింగాయపాలెం, నెక్కళ్లు, శాఖమూరులో ఒక్కొక్కరు చొప్పున మున్సిపాల్టీకి అనుకూలమని చేతులెత్తారు. 22 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టారు. గ్రామసభల్లో స్థానికులు తమ అభ్యంతరాలను గట్టిగానే చెప్పారు.
తాము భూములిచ్చింది రాజధాని కోసమని మున్సిపాల్టీగా మార్చడం వల్ల తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు.

ఒప్పందం ప్రకారం అభివృద్ధి జరగాలి..మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు ముహూర్తం పెట్టినరోజే ప్రభుత్వం గ్రామసభలు పెట్టింది. ప్రభుత్వ ఎత్తుగడను అర్థం చేసుకున్న రైతులు.. 22 గ్రామాల్లోనూ పాదయాత్రకు వెళ్లనివారితో తమ నిరసన గళాన్ని విన్పించడంలో విజయం సాధించారు. ఓవైపు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే... మరోవైపు తమ డిమాండ్ల చిట్టాను అధికారులకు అందజేశారు. 2015లో 3 మండలాల్లో 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ కింద అప్పటి ప్రభుత్వం తీసుకుందతెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం అభివృద్ధి జరగాలని రైతులు కోరారు.

జనాభా నిష్పత్తి లేకపోయినా మున్సిపాల్టీ అమలుకు ప్రయత్నం..మున్సిపాల్టీ ఏర్పాటుకు తగిన జనాభా నిష్పత్తి లేనప్పటికీ ప్రభుత్వం మున్సిపాల్టీని అమలుచేయడానికి ఎందుకు ముందుకు వచ్చిందని రైతులు ప్రశ్నించారు. రాజధాని పనులు ఆగిపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీగా మారిస్తే నరేగా పనులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు జరపాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు రాజధాని గ్రామాలను ముక్కలు చెక్కలు చేయడం ద్వారా కోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందని రైతులు చెప్పారు. అసలు ప్రజలు కోరుకుండానే.. ఎలాంటి తీర్మానం చేయకుండానే ప్రభుత్వం మున్సిపాల్టీగా మార్చడం వెనుక ఉద్దేశమేమిటని రైతులు ప్రశ్నించారు. 22 గ్రామసభల్లోనూ ప్రజలు మున్సిపాల్టీ వద్దంటూ.. రాజధాని నిర్మాణం కావాలంటూ చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details