ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పోలీసులు ఆపదలో ఉన్న ఓ యువతిని దిశ (disha) యాప్ సాయంతో కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన 21ఏళ్ల యువతి... శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తోంది. సొంతూరు నుంచి శ్రీసిటీకి వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలకు ఆ యువతి నాయుడుపేట బస్ స్టాండుకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులు లేకపోవడంతో ఆటోలో సుళ్లూరుపేట వెళ్లేందుకు పయనమైంది. ఆటోలో వెళ్తుండగా డ్రైవర్ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది.
దారిలోనే నేలబల్లి హైవేపై ఆ యువతి ఆటో దిగేసింది. జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఎటు పోవాలో దిక్కుతోచని ఆ యువతి... సోదరికి ఫోన్లో సమాచారమిచ్చింది. దీంతో కంగారుపడ్డ యువతి సోదరి.. దిశ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. నిమిషాల వ్యవధిలోనే వారు ఆ యువతి వద్దకు చేరుకున్నారు. పోలీసులే సూళ్లూరుపేటలోని హాస్టల్లో క్షేమంగా దింపారు.