ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్(AndhraPradesh State Development Corporation)కు రుణాలు పొందేందుకు వీలుగా విశాఖ(vishaka)లోని 213 ఎకరాల ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టే ప్రక్రియను పూర్తిచేశారు. ఏపీ ఆర్థికశాఖ అధికారులు విశాఖపట్నం వెళ్లి గురు, శుక్రవారాల్లో ఈ పని పూర్తిచేసినట్లు తెలిసింది. 2020 నవంబరులో ప్రారంభమైన రుణ ప్రక్రియలో భాగంగా అప్పట్లో కుదిరిన ఒప్పందం పూర్తయింది. ఈ మొత్తం వ్యవహారానికి రాష్ట్ర మంత్రిమండలి(cabinet) గతంలోనే ఆమోదముద్ర వేసిందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలుగా, లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు సొమ్ములు జమ చేసేందుకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రూ.21,500 కోట్ల రుణ సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌కు గ్యారంటీలు సమకూర్చింది. ఆ మేరకు కార్పొరేషన్ అధికారులు 2020 నవంబరు 5న బ్యాంకులతో గ్యారంటీ ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరిగి నవంబరు 24న గ్యారంటీ డీడ్ రాశారు. ఇందులో భాగంగా స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) (రూ.6,000 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంకు (రూ.5,000 కోట్లు), ఇండియన్ బ్యాంకు (రూ.2,500 కోట్లు), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (రూ.5,000 కోట్లు), బ్యాంకు ఆఫ్ బరోడా (రూ.3,000 కోట్లు) నుంచి రుణాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. గ్యారంటీ మాత్రమే కాకుండా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని నేరుగా రుణ చెల్లింపుల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది.
అదనంగా ఎక్సైజ్ సుంకం విధించి దాన్ని రాష్ట్ర కార్పస్ ఫండ్‌కు చేర్చి, అక్కడి నుంచి వచ్చిన మొత్తాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చేర్చేలా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 10 ఎక్సైజ్ డిపోల నుంచి వసూలయ్యే మొత్తాన్ని ఇలా ప్రతి నెలా చెల్లిస్తారు. ఇది కాకుండా రుణం పొందేందుకు బ్యాంకులు రుణ మొత్తంలో 10శాతానికి ఆస్తులను తనఖా పెట్టాలన్న డిమాండు మేరకు ఇప్పుడు విశాఖలోని 213 ఎకరాల తనఖా పూర్తిచేశారు. ఏపీలోని విశాఖలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆస్తులను వాటి విలువ ఆధారంగా లెక్కగట్టి ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ తరఫున బ్యాంకులకు కుదువ పెట్టేందుకు 213 ఎకరాలు గుర్తించారు. వాటిని భూపరిపాలన కమిషనర్‌కు బదలాయించి అక్కడి నుంచి ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంటు అథారిటీ ద్వారా ఆమోదం పొందారు.