తెలంగాణ

telangana

ETV Bharat / city

2020 రౌండప్:​ బండి జోరు.. భాజపా విజయాల హోరు - bjp victories in telangana

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలనాథులకు 2020 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జరిగిన అన్ని ఎన్నికల్లోనూ భాజపా ఆశాజనక ఫలితాలు సాధించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

telangana bjp recorded numerous victories in 2020
బండి జోరు.. భాజపా విజయాల హోరు

By

Published : Dec 29, 2020, 1:19 PM IST

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేడయమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కమలనాథులకు 2020 ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం జరిగిన అన్ని ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఉత్తమ ఫలితాలు సాధించి తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయం అని నిరూపించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకమయ్యాక.. పార్టీ జోరు రెట్టింపయింది.

కరోనాతో బండికి బ్రేక్

ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా తన ప్రభావాన్ని చూపించింది. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లు సాధించుకుంది. రాష్ట్ర కమలదళపతిగా బండి సంజయ్‌ని నియమించిన కొద్ది రోజులకే కరోనాతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల బండి జోరుకు బ్రేకు పడింది. ఈ విపత్కర సమయంలోనూ భాజపా శ్రేణులు వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి. కష్టకాలంలోనూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

గట్టి పోటీనిచ్చింది

పార్టీ బలోపేతం అవుతున్న క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడం వల్ల ఆ స్థానానికి నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో తెరాస సిట్టింగ్‌ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. దుబ్బాక ఎన్నికల ఫలితాల తరువాత డిసెంబర్‌ 1న నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా సత్తా చాటింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉన్న భాజపా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార తెరాసకు గట్టి పోటీ ఇచ్చి అనేక చోట్ల రెండో స్థానంలో నిలిచింది.

పక్కా ప్రణాళిక

వచ్చే ఏడాది జరిగే రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఇదే జోరును కొనసాగించేందుకు బండి సంజయ్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించి ఒక యాప్‌ను కూడా ప్రారంభించారు.

ఆపరేషన్ ఆకర్ష్

ఒక వైపు ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటూనే ఆపరేషన్‌ ఆకర్ష్​కు తెర తీశారు బండి సంజయ్‌. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌, గూడూరు నారాయణ రెడ్డి, బండ కార్తీక రెడ్డితో పాటు అనేక మందిని భాజపాలో చేర్చుకుని పార్టీని పటిష్ఠ పరిచారు.

2020 సంవత్సరం తెరాస, కాంగ్రెస్‌, వామపక్షాలకు ప్రతికూలం కాగా భాజపాకు మాత్రం అన్ని విధాలుగా కలిసొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details