తెలంగాణ

telangana

ETV Bharat / city

20 Years Of TRS: గులాబీజెండాకు 20 వసంతాలు.. తిరుగులేని ప్రస్థానంలో ఎన్నో విజయాలు.. - 20 years of anniversary to telangana rashtra samithi

గులాబీజెండా రెండు దశాబ్దాలు(20 years of trs party) పూర్తి చేసుకుంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. స్వీయ రాజకీయ అస్థిత్వం పేరిట తిరుగులేని శక్తిగా..... తెరాసను తీర్చిదిద్దారు. బంగారు తెలంగాణ లక్ష్యసాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏప్రిల్ 27న ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ(20 years of trs party).. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

20-years-of-anniversary-to-telangana-rashtra-samithi
20-years-of-anniversary-to-telangana-rashtra-samithi

By

Published : Oct 25, 2021, 5:37 AM IST

గులాబీజెండాకు 20 వసంతాలు.. తిరుగులేని ప్రస్థానంలో ఎన్నో విజయాలు..

దేశ రాజకీయాల్లో తెరాస సరికొత్త చరిత్రను లిఖించింది. తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చడంలో రాజకీయ పార్టీగా ప్రధాన భూమిక పోషించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు తెరాస అధినేత, గులాబీ దళపతి కేసీఆర్‌. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించిన కేసీఆర్​.. గులాబీజెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.... ముందుకు సాగింది ఆ పార్టీ. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకున్న తర్వాత.. అనివార్య కారణాలతో బయటకు వచ్చింది. ఆ తర్వాత తెరాస రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్ సహా పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. పదవులను లెక్కచేయక ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు.. క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో.... ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ 9న కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోనే కాలుపెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014 లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది.

ఎన్నికలేవైనా తెరాసదే విజయం...

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెరాస ఘనవిజయాన్ని సాధించి.. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన గులాబీ దళపతి కేసీఆర్... కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవతెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా... ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా తెరాస ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ... 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. కేసీఆర్ రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మధ్యలో ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్​ దృష్టిసారించారు. కానీ లోక్‌సభఎన్నికల్లో భాజపా ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెరాసకు అంత అనుకూలంగా రాలేదు. ఐతే ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థలఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అనంతరం జరిగినదుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు కొంత నిరాశకు గురిచేశాయి. సిట్టింగ్ స్థానమైన దుబ్బాకలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలుకాగా.. బల్దియాలో ఆశించిన సంఖ్యను అందుకోలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండుచోట్లా విజయం సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తామని కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో..

స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్... పలుఅంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు,రైతుబీమా, హరితహారం కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. రెండు పడకల గదుల ఇళ్లు, కుల వృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుల దశల ఎత్తిపోతల పథకాన్ని.. రికార్డు సమయంలో పూర్తిచేసింది. రాష్ట్రంలో పంటలు రికార్డు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. పార్టీ సాధించిన విజయాలను స్మరించుకుంటూ ద్విశతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తెరాస...ఆ స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతామని చెబుతోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details