రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికల తరహాలో ఉత్కంఠ రేపిన రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు జంబో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలెన్లలో నించుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయం ముగిసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలెన్లలో ఉండటంతో పలు కేంద్రాల్లో 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. జంబో బ్యాలెట్ నేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో 64.87 శాతం... వరంగల్-ఖమ్మం-నల్గొండలో 76.35 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో 45.9 శాంత పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 70.61 శాతానికి పెరిగింది. గతంలో కంటే మొత్తంగా 25 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది.
జనగాంలో అత్యధికంగా..
రాష్ట్రంలో 21 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని1530 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో జనగాంలో అత్యధికంగా 83.37 శాతం పోలింగ్ నమోదు కాగా... హైదరాబాద్‌లో అత్యల్పంగా 52.76 శాతం మంది ఓటేశారు. ఇక పూర్వపు వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో తెరాస, భాజపా నేతలు బాహాబాహీకి దిగారు. తెరాస కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని భాజపా, కాంగ్రెస్ నేతలు పలు చోట్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిపై దాడి జరిగిందంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.
లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు
రెండు పట్టభద్రుల స్థానాల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని.. వరంగల్-ఖమ్మం, నల్గొండ- పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు నల్గొండ మార్కెట్ యార్డు గిడ్డంగిలో జరుగుతుందన్నారు. పోలింగ్ వేళ ఓటర్ల స్పందన బాగా ఉందన్న ఆయన... ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించిన సిబ్బంది, పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
గెలుపుపై ధీమా
పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ రాష్ట్ర సమితి ధీమాతో ఉంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ పోలింగ్ సరళి సమీక్షించారు. రెండు స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నట్టు సన్నిహితుల వద్ద విశ్లేషించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో ఎంచుకున్న అంశాలు, పార్టీ శ్రేణుల మోహరింపు వంటి వ్యూహాలన్నీ ఆశించిన ఫలితాలను ఇవ్వబోతున్నాయని... ఆయన ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్.. నిరంతరం పార్టీ ఇంఛార్జిల నుంచి బూత్ స్థాయి నాయకుల వరకు.. మాట్లాడుతూ పోలింగ్ వ్యూహాలు మార్గనిర్దేశం చేశారు. 2 వారాలుగా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని.. పార్టీ చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే.. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఏడేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పట్టభద్రులు పోటెత్తారని.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి విజయం ఖాయమని ఆయన వెల్లడించారు.