నేడే బయోఆసియా సదస్సు ప్రారంభం.. కేటీఆర్, బిల్‌గేట్స్ మధ్య చర్చపై ఆసక్తి.. Bio Asia Summit 2022 : లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద సదస్సు అయిన బయోఆసియా సదస్సు ఈ రోజు నుంచి హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సుకు 70కు పైగా దేశాల నుంచి అధికారులు, పరిశ్రమ వర్గాలు, విద్యావేత్తలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో రెండో ఏడాదీ ఈ సదస్సును వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు జరిగే బయోఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగంపై విసిరిన సవాళ్లు, వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలు, కోవిడ్ సృష్టించిన అవకాశాలు, భవిష్యత్తు కార్యచరణ వంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా కేటీఆర్, బిల్‌గేట్స్ మధ్య చర్చ..
ఈసారి జరగనున్న సదస్సులో మొదటి రోజు కేటీఆర్, బిల్ గేట్స్ మధ్య జరగబోయే ఫైర్ సైడ్ ఛాట్ ప్యానల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అనంతరం కొవిడ్ అనుభవాలు, దాని ప్రభావం వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లా పాల్గొంటారు. ఆరోగ్య రంగంలో టెక్నాలజీ ప్రాధాన్యంపై జరగనున్న సెషన్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలు వారి అభిప్రాయలు, అవకాశాలను వెల్లడిస్తాయి. సదస్సు రెండో రోజు ఫార్మా రంగం వృద్ధి, ఆ రంగం నుంచి అవకాశాలపై చర్చ జరగనుంది. ఇందులో బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్, జైడస్ క్యాడిలా, సీరమ్స్ భాగం కానున్నాయి. సీఈవో కాంక్లేవ్ ప్యానల్‌లో పిరమిల్ గ్రూప్, సన్ ఫార్మా, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ సంస్థల సీఈవోలు, ఎండీలు పాల్గొని చర్చించనున్నారు.
మొత్తంగా రెండ్రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ సదస్సు.. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగాలకు దశ దిశ సూచిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రకమైన సదస్సుల నిర్వహణ ద్వారా ఆరోగ్య రంగంలో హైదరాబాద్ తన క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఘనంగా చాటినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: