telangana gurukul students: రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2021-22 వైద్య విద్య సంవత్సరంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో ఏకంగా 190 మంది ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించడం విశేషం. ఇందులో అత్యధికులు గ్రామీణ, పట్టణ మురికివాడలకు చెందినవారే. వీరిలోనూ 90 శాతం మందికి పైగా నిరుపేద, గిరిజన కుటుంబాలకు చెందినవారే. వైద్యుడు అవ్వాలనే వారి కలను గురుకుల విద్య సాకారం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ‘గౌలిదొడ్డి నైపుణ్య శిక్షణ కేంద్రం’ ఇందుకు వేదికైంది. కార్పొరేట్ శిక్షణకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ నీట్ శిక్షణ అందించారు. కఠినమైన బోధనాంశాలను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడంలో ఇక్కడ ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినా.. నీట్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కూడా కఠిన శిక్షణకు తలవంచారు. ఫలితంగా అసాధ్యమనుకున్న ర్యాంకులను సుసాధ్యం చేసి చూపించారు. తొలివిడత ప్రవేశాల్లోనే ఇంత భారీ సంఖ్యలో వైద్యవిద్యలో ప్రవేశాలు సాధిస్తే.. ఇక 2వ, 3వ విడత ప్రవేశాల్లో మరిన్ని ఎక్కువ సీట్లు పొందే అవకాశాలున్నాయని గురుకుల విద్య వర్గాలు తెలిపాయి. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు సీట్లు పొందారని చెప్పారు.
తండ్రి సఫాయి కార్మికుడు.. తల్లి కూలీ
బోనగిరి సన్నీ.. గౌలిదొడ్డి గురుకుల నైపుణ్య శిక్షణ కేంద్రంలో చదివి.. ఇప్పుడు గాంధీ వైద్య కళాశాలలో సీటు సంపాదించాడు. తండ్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సఫాయి కార్మికుడు. ఊరును శుభ్రంగా ఉంచడం ఆయన విధి. తల్లి రోజువారీ కూలీ. ఒక చెల్లి ప్రస్తుతం గురుకుల పాఠశాలలోనే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. నాలుగో తరగతి వరకూ ఊర్లోనే చదువుకున్న సన్నీ.. 5-8వ తరగతి వరకు హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో.. 9, 10 కరీంనగర్‌లోని గురుకుల పాఠశాలలో విద్య అభ్యసించాడు. ఇంటర్మీడియట్ గౌలిదొడ్డి గురుకులంలో చదివాడు. ఇక్కడి బోధన తనని రాటు దేల్చిందని చెబుతున్నాడు సన్నీ. తనలాగే మరింత మంది గురుకుల విద్యను ఉపయోగించుకోవాలని సూచించాడు.
చిన్నతనం నుంచే చదువరి
మహబూబాబాద్ జిల్లా చర్లపాలెంకు చెందిన స్పందన చిన్నతనం నుంచే ప్రతిభావంతురాలు. తండ్రి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు, తల్లి గృహిణి. చెల్లెలు ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదువుతోంది. 1-10వ తరగతి వరకు చర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. 3-10వరకు అన్ని తరగతుల్లోనూ ఎప్పుడూ మొదటిస్థానంలో నిలిచింది. ప్రవాస భారతీయులు ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి తదితరులు ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా.. పాఠశాలలో నగదు పురస్కారాన్ని అందజేస్తుండగా.. అన్ని తరగతుల్లోనూ స్పందనే ఆ నగదును పొందడం ఆమె ప్రతిభకు తార్కాణం. గౌలిదొడ్డి గురుకుల శిక్షణ కేంద్రంలో అభ్యసించి.. ఇప్పుడు ఉస్మానియా వైద్యకళాశాలలో సీటు పొందింది. ‘‘డాక్టర్ అవ్వాలనే నా కల నెరవేరడం ఆనందంగా ఉంది. చిన్నతనంలో నన్ను ప్రోత్సహించిన ప్రవాస భారతీయ వైద్యుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి నాకు ప్రేరణ. నీట్‌లో మంచి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులు అందించిన శిక్షణ, ప్రోత్సాహం ఎనలేనిది. మూత్రపిండాల వైద్యురాలిగా పేదలకు సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని తన మనసులో మాట వెలిబుచ్చారు స్పందన.