దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రధాని మోదీ పురస్కారాలు అందజేశారు. సమర్థవంతమైన పనితీరు, మెరుగైన అభివృద్ధి ప్రణాళికల అమలు ప్రాతిపదికగా.. పంచాయతీలు, పరిషత్‌లకు ఈ అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ.. అవార్డులు ప్రదానం చేశారు. ఏపీలోని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ పంచాయతీలకు కేంద్రం పురస్కారాలు.. ఏపీకి 17 అవార్డులు - దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ సశక్తీకరణ అవార్డులు న్యూస్
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రధాని మోదీ పురస్కారాలను అందించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 అవార్డులు దక్కాయి.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ సశక్తీకరణ పురస్కారాల్లో భాగంగా ఏపీకి తొలిసారిగా 17 అవార్డులు దక్కాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎక్కువ అవార్డులు దక్కించుకున్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ-గవర్నెన్సు అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచామని.. గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్ లకు అవార్డులు వచ్చాయన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని.. ఆ దిశగా పంచాయతీలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్