తెలంగాణ

telangana

ETV Bharat / city

Land Mafia: వెలుగులోకి మరో భూబాగోతం... 150 కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం - వెలుగులోకి మరో భూబాగోతం

హైదరాబాద్ మహానగరం చుట్టూ రోజుకో భూ అక్రమం బయటపడుతోంది. ధరలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు తాయిలాలకు అలవాటు పడి.. వారికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 150 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి.

150 crores worth places garbing in sangareddy district
150 crores worth places garbing in sangareddy district

By

Published : Aug 23, 2021, 4:52 AM IST

సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామ పరిధిలో బాహ్య వలయ రహదారి‍‌(ORR) నిర్మించారు. ఇందుకోసం సర్వే నెంబర్ 205లో 4.38ఎకరాలను హెచ్​ఎండీఏ(HMDA) సేకరించింది. నలుగురు రైతులకు పరిహారం చెల్లించింది. వీరిలో ముగ్గురి తరఫున వీఎల్​ఎస్​.ప్రసాద్ అనే వ్యక్తి జీపీఏ హక్కుదారుడిగా పరిహారం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం రికార్డుల్లో మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద ఈ సర్వే నెంబర్లో గుంట భూమి కూడా లేదు. ఓఆర్​ఆర్​ పేరు మీద ఉండాల్సిన భూమిని గతంలో ఇదే సర్వే నెంబర్లో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్న వారి పేర్ల మీద నమోదు చేశారు. అలాగే సర్వే నంబర్‌ 209లో బాహ్య వలయ రహదారి కోసం 6.29ఎకరాల భూమి అవసరమైంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థలాన్ని సేకరించి రోడ్డు నిర్మించినా... భూయాజమాన్య హక్కుల్లో వివాదం కారణంగా పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం కొంత మంది తమకు రికార్డులో ఉన్న భూమి కంటే క్షేత్ర స్థాయిలో తక్కువ ఉందని, పక్కనే ఉన్న సర్వే సంఖ్య 191లోని ప్రభుత్వ భూమిని అక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.


సర్వే సంఖ్య 210లో మొత్తం విస్తీర్ణం 10.23ఎకరాలు ఉండగా, బాహ్య వలయ రహదారి కోసం 10.04ఎకరాలు సేకరించారు. 4.37ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. బహిరంగ మార్కెట్ విలువ కంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తోందన్న కారణంతో మిగిలిన 5.07 ఎకరాలకు పరిహారం తీసుకునేందుకు యజమానులు నిరాకరించారు. ఈ సర్వే సంఖ్యలో కేవలం 19గుంటల భూమి మాత్రమే మిగిలింది. కానీ క్షేత్ర స్థాయిలో భూమి ఎక్కువగా ఉందంటూ...... 2014లో అప్పటి తహశీల్దార్ 5.07ఎకరాలకు ప్రైవేటు వ్యక్తులకు పాసుపుస్తకాలు జారీ చేశారు.

కేవలం ఈ మూడు సర్వే సంఖ్యల పరిధిలోనే 10.05ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులకు పాసుపుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా 15కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన అన్యాక్రాంతమైన భూమి విలువ 150కోట్లకు పైగానే ఉంటుంది. ప్రజాప్రయోజనాలు కోసం సేకరించిన భూమి వివరాలను ప్రభుత్వం సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపిస్తుంది. వాటికి సంబంధించిన లావాదేవీలేవీ జరపవద్దని ఆదేశిస్తుంది. కొల్లూరులోని ఈ భూముల్లో మాత్రం అమ్మకాలు, కొనుగోళ్లు నిరాటంకంగా సాగుతున్నాయి. అక్రమార్కులు రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు HMDA అధికారులను సైతం ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రికార్డులు మార్పు చేస్తామని రామచంద్రాపురం తహశీల్దారు శివకుమార్ తెలిపారు. ఈ మొత్తం భూ వ్యవహారంలో ఒకే వ్యక్తి చక్రం తిప్పుతున్నట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు.

ఇదీ చూడండి:

Afghan crisis: 'భారత్ మాకు​ రెండో ఇల్లు'.. అఫ్గానీల ఆనందబాష్పాలు

ABOUT THE AUTHOR

...view details