తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేజీఎఫ్​' రాకీభాయ్​ మేనరిజం తెచ్చిన తంట.. ఆస్పత్రిపాలైన 15 ఏళ్ల కుర్రాడు!

సినీఅభిమానుల్లో కేజీఎఫ్​-2 సినిమా నింపిన జోష్​ అంతా ఇంతా కాదు. సినిమాలో రాకీభాయ్​ ఎలివేషన్స్​కి ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. హీరో మేనరిజమ్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో గూస్​బంప్స్​ తెప్పించిన సన్నివేశాలు సినిమాలో కోకొల్లలు. వాటిని చూసి ఇదిరా హీరోయిజం అంటే.. అని ప్రతీ సినీ అభిమాని అనుకున్నాడు. అయితే.. ఓ యువకుడు మాత్రం ఆ హీరో మేనరిజమ్ ట్రై చేశాడు... కట్​ చేస్తే!!

15 years boy hospitalized for tried KGF rocky bhai mannerism in hyderabad
15 years boy hospitalized for tried KGF rocky bhai mannerism in hyderabad

By

Published : May 28, 2022, 9:56 PM IST

'కేజీఎఫ్​-2' సినిమాలో.. హీరో ధీరత్వాన్ని కళ్లారా చూసిన కొంత మంది పిల్లల గుంపు.. అతని నుంచి స్ఫూర్తి పొందుతారు. రాకీభాయ్​ మేనరిజాన్ని అనుకరిస్తుంటారు. మొదటి పార్ట్​లో రాకీభాయ్​ ఏం చేశాడన్న కథను పార్ట్​-2లో.. అచ్చం అలాగే చేసి చూపించి హీరోయిన్​కు వివరిస్తారు. ఇదంతా సినిమా కథలో భాగంగా జరుగుతుంది. అయితే.. రాకీభాయ్​ని చూసి సినిమాలో పిల్లల్లాగే.. బయట కూడా ఓ 15 ఏళ్ల కుర్రాడు విపరీతమైన స్ఫూర్తి పొందాడు. రాకీభాయ్​ స్టైల్​, మేనరిజమ్​ బాగా నచ్చి.. నిజజీవితంలో వాటిని అనుకరిస్తూ వచ్చాడు. తనకు తానే రోజూ రాకీభాయ్​లా పోజులు కొడుతున్నాడు. నడక, స్టైల్​, ఇలా అన్నింటిలో హీరోను ఫాలో అవుతున్నాడు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆ కుర్రాడు అంతటితో ఆగకుండా.. ఇంకో అడుగు ముందుకేశాడు. ఆ సినిమాలో రాకీభాయ్​ సిగరెట్లు తాగే స్టైల్​ నచ్చి.. దాన్ని కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు. అచ్చంగా అదే స్టైల్​ రావటం కోసం మన కుర్రహీరో.. ఒకేసారి ఏకంగా ఓ ప్యాకెట్​ సిగరెట్లు పీల్చేశాడు. కట్​ చేస్తే.. ఆ స్టైల్​ రావటం అటుంచింతే.. మనోడు చేసి ప్రయత్నం బెడిసికొట్టి.. ఆస్పత్రి బెడ్​పై పడ్డాడు.

హైదరాబాద్​ రాజేంద్రనగర్​కు చెందిన బాలుడు(15).. ఇటీవల థియేటర్​లో 'కేజీఎఫ్​-2' సినిమా చూశాడు. అందులో రాకీ భాయ్​గా నటించిన యష్​ నటన చూసి ఫుల్​ ఫిదా అయ్యాడు. అందులో రాకీ మేనరిజమ్స్​కు ప్రభావితమై.. ఈ ప్రయోగం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒక ప్యాకెట్​ సిగరెట్లు మొత్తం పీల్చేశాడు. ఆ కాసేపటికే తీవ్రంగా దగ్గు, గొంతు నొప్పి రావడంతో గుర్తించిన కుటుంబీకులు హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాధితుడికి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. సినిమాల్లో హీరోల క్యారెక్టర్లకు పిల్లలు సులభంగా ప్రభావితమవుతారని.. వాళ్లను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలని చెబుతున్నారు. సినిమాల్లోని హీరోలను అనుకరిస్తూ.. మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగాక పశ్చాత్తాప పడితే లాభం లేదని ముందే జాగ్రత్త పడాలంటున్నారు. సమాజంపై సినిమాలు మంచి ప్రభావం చూపితే పరవాలేదు కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details