లాక్‌డౌన్ సమయంలో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సుమారు 15 వేల వాహనాలను జప్తుచేసినట్లు సమాచారం. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు. కొందరికి నిజంగానే అత్యవసర పనులుంటున్నా కొందరు మాత్రం అకారణంగా బయట తిరుగుతున్నారు. ఇలా వచ్చే వాహనాన్ని గుర్తిస్తే తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు. రూ.వెయ్యి జరిమానా చెల్లించినా సరే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే వాటిని వదిలివేయాలని నిర్ణయించారు.
లాక్‌డౌన్ ఉల్లంఘనపై పోలీసుల ఉక్కుపాదం - 15 thousand vehicles were seized in telangana
రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాటికి 15వేల వాహనాలు జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో వాహనాలు సీజ్, వాహనాలు సీజ్, తెలంగాణ వార్తలు
లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వాహనదారులపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంపైనా దృష్టి సారించారు. సెక్షన్ 188 కింద కేసులు నమోదైనా సరే తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరు కావాల్సిందేనని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సందర్భంగా నమోదైన కేసుల్లోని నిందితులు ఇప్పటికీ న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పటికే 5.35 లక్షలకుపైగా కేసులు
- రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో తొలి రెండు వారాల్లోనే 4.31 లక్షల కేసులు నమోదు చేశారు. మాస్క్ ధరించని వారిపై దాదాపు రూ.31 కోట్ల జరిమానాలు విధించారు. ఈ కేసుల సంఖ్య తాజాగా 5.35 లక్షలు దాటినట్లు చెబుతున్నారు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు కానుండటంతో లాక్‌డౌన్ ఎత్తేసిన అనంతరం న్యాయస్థానాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
- రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ అమలైనప్పటి నుంచి శుక్రవారం నాటికి 25,537 కేసులు నమోదు చేశారు. 1,579 వాహనాలను జప్తు చేశారు. సైబరాబాద్‌లో దాదాపు 16వేల కేసులు నమోదు చేశారు.
- ఆదిలాబాద్ జిల్లాలో 4,413 మంది ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 277 ద్విచక్రవాహనాలు, అయిదు కార్లను జప్తు చేశారు.
- రామగుండం కమిషనరేట్ పరిధిలో గురువారం నాటికి దాదాపు అయిదు వేల మందిపై కేసులు నమోదు చేశారు.
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 20 నాటికి 3,843 కేసులు నమోదు చేశారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 560 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. వీరిలో పలువురికి జరిమానాలు విధించారు.