రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల వరకు నిత్యావసరాల కోసం వ్యాపార సముదాయాలు, మార్కెట్ల దగ్గర... ఉబ్బడి ముబ్బడిగా ప్రజలు గుమిగూడారు. పోలీసుల హెచ్చరికలతో... ఆ తర్వాత ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో పద్నాలుగో రోజు పకడ్బందీగా లాక్‌డౌన్ - telangana lockdown today
రాష్ట్రంలో లాక్‌డౌన్ పద్నాలుగో రోజు పకడ్బందీగా అమలవుతోంది. లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించే అవకాశం రాకుండా చూడాలన్న సీఎం ఆదేశాలతో పోలీసులు మరింత కఠినంగా ఆంక్షలు అమలయ్యేలా చూస్తున్నారు. నిబంధనల ఉల్లఘనలు జరగకుండా పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. పది దాటిందంటే రోడ్ల మీదికి రావొద్దని మరీ మరీ హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ గోషామహల్‌లో ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేవలం గంట వ్యవధిలోనే సుమారు 55 వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు. సడలింపు సమయం ముగిసిన తర్వాత కూడా....అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసులు నిలువరించారు. అందువల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంబజార్‌లో చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.
వెయ్యి 22 వాహనాలు జప్తు
సంగారెడ్డిలోని వివిధ కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమతులు ఉంటెనే రహదారులపైకి రావాలని సూచించారు. జగిత్యాలలో కట్టుదిట్టంగా ఆంక్షలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు... ఇప్పటి వరకు వెయ్యి 22 వాహనాలు జప్తు చేశారు. ఖమ్మంలో 10 తర్వాత బయటకు వచ్చే వాహనదారులను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.