రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసులు కొత్తగా 1,296 నమోదయ్యాయి. మొత్తంగా బాధితుల సంఖ్య 45,076కు పెరిగింది. తాజా ఫలితాల్లో అత్యధిక కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 557 నమోదు కాగా, వరంగల్ నగరలో 117, రంగారెడ్డిలో 111, మేడ్చల్‌లో 87, కామారెడ్డిలో 67,వరంగల్ గ్రామీణలో 41, పెద్దపల్లి, మెదక్‌లలో 29 చొప్పున, సంగారెడ్డిలో 28, కరీంనగర్‌లో 27, నల్గొండలో 26, నిజామాబాద్‌లో 24, మహబూబాబాద్‌లో 21, రాజన్న సిరిసిల్లలో 19, సూర్యాపేటలో 16, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌లలో 15 చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 13, జగిత్యాలలో 11, సిద్దిపేటలో 10 కేసులు నమోదయ్యాయి.
ఆరుగురు మృతి
ఇవి కాకుండా స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైన జిల్లాలను కలుపుకుంటే.. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం 29 జిల్లాల్లో కరోనా జాడలు కనిపించాయి. తాజాగా మరో 1,831 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 32,438(72 శాతం)కు పెరిగింది.
ఆదివారం ఈ వైరస్ బారినపడి మరో ఆరుగురు మరణించగా, మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 415కి చేరుకుంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాలు 0.92 శాతంగా వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, ఐసొలేషన్‌లో 12,224 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 12,519 నమూనాలు పరీక్షించగా, ఇప్పటి వరకూ రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 2,65,219కి పెరిగింది. మొత్తం పరీక్షల్లో పాజిటివ్‌ల శాతం 17గా నమోదైంది.
118 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స
రాష్ట్రంలో మొత్తం 118 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిల్లో 57 ప్రైవేటు ఆసుపత్రులు కాగా, మిగిలిన 61 సర్కారు దవాఖానాలు. ఇప్పటి వరకూ కరోనా చికిత్సల కోసం అత్యధికులు గాంధీ ఆసుపత్రికి లేదా ఓ 15 కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.