Old city Riots in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఓల్డ్ సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. మీర్‌చౌక్, చార్మినార్, గోషామహల్ పరిధిలో మొత్తం 360 మంది ఆర్పీఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నాయి. ప్రధాన ప్రాంతాలైన చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, శాలిబండతో పాటు మోగల్పురా, తలాబ్ కట్టా, రీన్‌బజార్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు రాత్రి 8 గంటల లోపే మూసివేయించారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వాహనదారులు, పాదచారులను ఇళ్లకు పంపించారు. వీధివీధి గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించారు. అదనపు సీపీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం, అరెస్టయిన 127 మంది యువకులు విడుదల - old city riots in Hyderabad
Old city Riots in Hyderabad హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో మొత్తం కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిన్న రాత్రి అరెస్టయిన యువకుల్లో 127 మందిని పోలీసులు విడుదల చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం రోజున.. శాలిబండ, సైదాబాద్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేశారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. యువతను నియంత్రించేందుకు పోలీసులు అప్రమత్తమైనప్పటికీ.. అర్ధరాత్రి కొంతమంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. చార్మినార్, శాలిబండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. ఆందోళనకారులు రోడ్డు మీదకు రాకుండా పోలీసుల రాత్రంతా గస్తీ కాశారు.
ఇదిలా ఉండగా.. అరెస్ట్ చేసిన యువకులను విడుదల చేయాలని పోలీసులను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. పరిస్థితి సద్దుమణిగాక అర్ధరాత్రి 3 గంటల వేళ 127 మంది యువకులను కంచన్‌బాగ్ పోలీసులు విడుదల చేశారు. తెల్లవారుజామున శాలిబండకు వచ్చిన సీపీ సీవీ ఆనంద్.. పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకోవాలని సూచించారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.