తెలంగాణ

telangana

పదో తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్థులంతా పాస్

By

Published : Jun 20, 2020, 7:24 PM IST

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని... భవిష్యత్తులో కరోనా కేసులు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయని మంత్రి అన్నారు. పరీక్షలు లేకుండానే పైతరగతులకు పదో తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్లు ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. మార్కులు, గ్రేడింగ్‌కు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు.. అంతా పాస్​
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు.. అంతా పాస్​

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తామని చెప్పారు. కేంద్ర హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 15న భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం సేకరించామని మంత్రి తెలిపారు.

‘‘పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి పని చేయాలి. ఇంతమంది ఒకే చోట గుమిగూడటం అంత శ్రేయస్కరం కాదని పరీక్షలు వాయిదా వేశాం. కరోనా ప్రభలుతున్న తరుణంలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా పరీక్షలు రద్దు చేయాలని ఆదేశించారు’’ - మంత్రి సురేశ్‌

తొలుత జులై 10-17 వరకు పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ఆన్‌లైన్‌, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పారు. వీటితో పాటు పరీక్షల నిర్వహణ కోసం 11 పేపర్లను ఆరుకు కుదించారు. భౌతిక దూరం పాటించడం కోసం పరీక్ష కేంద్రాలు రెట్టింపు కూడా చేశారు. శానిటైజర్లు, థర్మల్ స్కానర్,లు మాస్కులు సిద్ధం చేశారు. కానీ పరిస్థితి అదుపులో లేకపోవడంతో పరీక్షలు రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details