AP Corona Cases: ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,209 పరీక్షలు నిర్వహించగా.. 104 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,489కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,672 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1,249 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
Central teams to states: మరోవైపు దేశంలో ఓ వైపు ఒమిక్రాన్ భయాలు, మరోవైపు కొత్త కేసుల పెరుగుదల నేపథ్యంలో కట్టడి చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో కేంద్ర అత్యున్నత స్థాయి బృందాలను మోహరించనున్నట్లు శనివారం తెలిపింది కేంద్రం వైద్య, ఆరోగ్య శాఖ.
" ఒమిక్రాన్ కేసులు, కొవిడ్-19 కేసుల్లో భారీగా పెరుగదల లేదా వ్యాక్సినేషన్ నెమ్మదిగా నడుస్తున్నట్టు గుర్తించిన 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించాం. ఆ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్. ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో మూడు నుంచి ఐదు రోజుల పాటు పర్యటిస్తాయి. రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయి. " - కేంద్ర ఆరోగ్య శాఖ
ప్రత్యేక బృందాలు ముఖ్యంగా.. కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘా, కంటైన్మెంట్ కార్యక్రమాలు, కొవిడ్-19 పరీక్షలు, అవసరమైన నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్కు పంపించటం వంటి అంశాలను పరిశీలించనున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే.. కొవిడ్ జాగ్రత్తలు అమలు చేయటం, ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అంబులెన్స్‌లు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్‌తో పాటు రవాణా, వ్యాక్సినేషన్ పురోగతికి కూడా ఈ బృందాలు బాధ్యత వహిస్తాయి. 'రాష్ట్రస్థాయి కేంద్ర బృందాలు పరిస్థితులను అంచనా వేయటం, అవసరమైన చర్యలను సూచించటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజారోగ్య కార్యక్రమాలపై ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు నివేదిక సమర్పిస్తాయి.' అని ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 7,189 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు చేరింది.
90 శాతం ఎలాంటి లక్షణాలు లేవు..
Omicron symptoms and treatment: ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 115 మంది కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవడం, ఒకవేళ కొందరిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు దిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకినప్పటికీ త్వరగా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటంలేదని తెలిపారు.
omicron cases: ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90 శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలూ లేకపోవడం, వాళ్లకు చికిత్సలు కూడా అందించాల్సిన అవసరంలేకపోవడం ఊరటనిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు రాగా.. దిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్ణాటక 31, రాజస్థాన్ 22, హరియాణా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో 4 చొప్పున కేసులు రాగా.. జమ్ముకశ్మీర్, బంగాల్‌లలో మూడేసి కేసులు వచ్చాయి. ఇకపోతే యూపీలో రెండు, చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నైట్ కర్ఫ్యూలతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.