తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై గెలిచిన వీరులు.. కోలుకున్న బాధితులు వెయ్యి.. - కరోనా బారీ నుంచి కోలుకున్న వారు

కరోనాపై పోరులో తెలంగాణ ఒక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు వైరస్​ బారి నుంచి కోలుకుని ఇంటికి చేరిన వారి సంఖ్య వెయ్యి దాటింది. ప్రభుత్వ వైద్యంలో ఇది అత్యుత్తమ సేవలకు నిదర్శనమని, ఇంత భారీ సంఖ్యలో కోలుకుని ఇళ్లకెళ్లడం ఒక మైలురాయిగా భావిస్తున్నామని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

1000 corona recovered patients  in telangana now
కరోనా మహమ్మారిపై పోరులో మరో మైలురాయి

By

Published : May 19, 2020, 7:47 AM IST

Updated : May 19, 2020, 9:49 AM IST

కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ ఒక మైలురాయిని అధిగమించింది. వైరస్‌తో పోరాడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య సోమవారానికి వెయ్యి దాటింది. రాష్ట్రంలో నిన్న మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 1592కు పెరిగింది. వీరిలో సోమవారం డిశ్ఛార్జి అయిన 10 మందిని కలిపితే ఇప్పటి వరకూ 62.93 శాతం(1002 మంది) కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. వీరిలో 66 శాతం(663మంది) పురుషులు కాగా, 34 శాతం(339 మంది) మహిళలున్నారు.

డిశ్ఛార్జి అయినవారిలో అత్యధికులు 21-40 ఏళ్ల మధ్య వయస్కులు 43.41 శాతం(435 మంది) ఉండగా.. పదేళ్లలోపు చిన్నారులు 85 మంది, 61-80 ఏళ్ల వృద్ధులు 75 మంది ఉండటం విశేషం. ఇందులోనూ 71 ఏళ్లపైబడిన వృద్ధులు 15 మంది ఉండటం మిగిలిన బాధితుల్లో ధైర్యాన్ని నింపే అంశమే.

జాగ్రత్తలు తీసుకోవడమే..

ఇది ప్రభుత్వ వైద్యంలో అత్యుత్తమ సేవలకు నిదర్శనమని, ఇంత భారీ సంఖ్యలో కోలుకొని ఇళ్లకెళ్లడం ఒక మైలురాయిగా భావిస్తున్నామని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే శ్రేయస్కరమని, వ్యక్తిగత దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడాన్ని క్రమం తప్పకుండా చేయాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

వలసల్లో 69 పాజిటివ్‌లు

కరోనాతో ప్రస్తుతం 556 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. సోమవారం నమోదైన కేసుల్లో 26 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలో, మేడ్చల్‌ జిల్లాలో ముగ్గురు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వలసజీవుల్లో మంచిర్యాల ఏడుగురు, జగిత్యాల నలుగురు, ఖమ్మం ఒక్కరు కలిపి తాజాగా 12 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో మొత్తంగా 69 మందిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మంచిర్యాలలో ఏడుగురికి పాజిటివ్‌

జిల్లాలో ఆదివారం సేకరించిన 12 నమూనాల్లో ఏడుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఇప్పటివరకు జిల్లాలో 18 కేసులు నమోదు కాగా.. ఇందులో 17 మంది ముంబయి నుంచి ఇటీవల వచ్చినవారే.

ఖమ్మం జిల్లాలో మరో కేసు

ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మధిర మండలం మహదేవపురానికి చెందిన 35 మంది వలస కార్మికులు గతంలో మహారాష్ట్రకు వెళ్లారు. వారు ఈనెల 13, 14 తేదీల్లో వారు తిరిగి వచ్చారు. ఏడుగురి నమూనాలు పరీక్షలకు పంపించగా, ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి చెప్పారు.

ఇవీ చూడండి: 'తెల్ల బంగారం.. ప్రగతికి సాకారం'

Last Updated : May 19, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details