శ్రీలంకలో ఆ ప్రభుత్వం తీసుకున్న వంద శాతం సేంద్రియ వ్యవసాయ విధానం(Organic Cultivation in Sri Lanka) నిర్ణయం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని వ్యవసాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండేళ్లలో ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దశలవారీగా కాకుండా ఒకేసారి ‘నూరు శాతం(Organic Cultivation in Sri Lanka)’ లక్ష్యంతో వెళ్లే దేశంలో ఆహారభద్రత సమస్య వస్తుందని అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయంపై అధ్యయనం చేసిన పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. దిగుమతి చేసుకొనే ఎరువులను రైతులకు సబ్సిడీపై అందిస్తామని 2019 ఎన్నికల్లో రాజపక్స హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లలోనే దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకొన్నారు. అన్ని రకాల ఎరువులు, క్రిమిసంహారక మందుల దిగుమతిని నిషేధిస్తూ నూరుశాతం సేంద్రియ సేద్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 6న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘ప్రభుత్వ నిర్ణయం(Organic Cultivation in Sri Lanka) ధాన్యం పండించే రైతులు, టీ, మిరియాలు, దాల్చినచెక్క ఉత్పత్తిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లక్షా ఏడువేల హెక్టార్లలో రబ్బరు సాగు చేస్తే, ఇందులో 20వేల హెక్టార్లకు ఆకు తెగులు వస్తుంది. క్రిమిసంహారక మందులు లేకపోతే 15 నుంచి 20 శాతం వరకు రబ్బరు ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అన్ని వర్గాల నుంచి ఒత్తిడితో దిగుమతి చేసుకొనే సేంద్రియ ఎరువులో పదిశాతం న్యూట్రియంట్స్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది’’ అని ఓ వ్యవసాయ ఆర్థికవేత్త తెలిపారు.
భూటాన్ అనుభవం ఇలా...
2020 నాటికి నూరుశాతం సేంద్రియ సాగు(Organic Cultivation in Sri Lanka) అమలు చేస్తామని 2008లో భూటాన్ ప్రకటించింది. 2018లో ఈ విధానాన్ని మార్చుకొంది. దీనికి కారణం వ్యవసాయ దిగుబడులు తగ్గడంతోపాటు ఆహార పదార్థాల దిగుమతి గణనీయంగా పెరగడమే. 2035 నాటికి నూరుశాతం అమలు చేయాలన్నది తాజా లక్ష్యం. మన దేశంలో 2003లో సిక్కిం ఈ నిర్ణయం తీసుకోగా 13 ఏళ్ల తర్వాత సేంద్రియ సాగు పూర్తిగా అమలు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే సిక్కింలో మొదటి నుంచి రసాయనిక ఎరువుల వినియోగం తక్కువ. ఇలాంటి సానుకూల వాతావరణం ఉన్న చోటే 13 ఏళ్లు పట్టిందని, అలాంటిది శ్రీలంక అకస్మాత్తుగా నూరు శాతం సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయాలన్న నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని ఓ వ్యవసాయ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
ఉత్పాదకత, సుస్థిరతే ముఖ్యం