ఏపీలోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠశాలలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
పెదపాలపర్రు ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా "విద్యార్థులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం. 10 మందికి పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. అందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. మిగతా విద్యార్థులకూ పరీక్షలు చేయిస్తాం. డీఈవో ఆదేశాల మేరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. కరోనా బారిన పడిన విద్యార్థులు చదివే స్కూల్ మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తాం. మరో పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి సైతం కరోనా బారిన పడ్డాడు. అతన్ని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాం"
- నరేష్, ముదినేపల్లి ఎంఈవో
ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్దులతో పాటు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు కూడా తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61వేల 137 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు బడిగంట మోగింది. అన్ని పాఠశాలలో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.
ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతించి భోదించారు. విద్యార్ధులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ తెచ్చుకుని పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు సూచించారు. పాఠశాలల్లోకి వచ్చే ముందు ప్రతి విద్యార్ధిని ఉష్ణోగ్రత పరిశీలించిన అనంతరమే తరగతి గదిలోకి అనుమతించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... 10 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో ఆ నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇదీ చూడండి:హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు