అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎక్కడా గందరగోళానికి తావు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రిజర్వేషన్లు లేని అన్ని సామాజిక వర్గాలకు ఇవీ వర్తిస్తాయన్నారు. వార్షికాదాయం 8 లక్షల లోపు ఉంటే చాలు వారికి రిజర్వేషన్లు వర్తింప చేసేలా జీవో విడుదల చేశామని మంత్రి తెలిపారు.
గందరగోళం సృష్టించారు
గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు బీసీ-ఎఫ్ పేరిట 5 శాతం రిజర్వేషన్లు కల్పించి గందరగోళం సృష్టించారని.. కోర్టుల్లో కేసులు వేసి దాన్ని నిలిపివేశారన్నారు. కాపుల రిజర్వేషన్లపై కేంద్రానికి ఓ లేఖ రాసి వారిపైకి నెట్టేశారని ఆరోపించారు. కాపులను బీసీలుగా పరిగణించాలో, అగ్రవర్ణాలుగా పరిగణించాలో తెలియని పరిస్థితిని సృష్టించారన్నారు. కాపులు, బ్రాహ్మణులు, రెడ్డి, రాజులు.. ఇలా ఎవరైనా 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే.. ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. ఈ ధృవపత్రాలు స్థానిక తహసీల్దార్లే జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.