సికింద్రాబాద్లో త్రిముఖ పోరు గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి బలమైన పోటీ నెలకొంది. తెరాస నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్, భాజపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తలపడుతున్నారు. జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 15మంది స్వతంత్రులతో కలిపి 28 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. ఎంతమంది బరిలో ఉన్నా... తెరాస, భాజపా, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.
ఎవరి ధీమా వారిదే..
సికింద్రాబాద్ నియోజకవర్గంలో 19 లక్షల 68 వేల 147 ఓటర్లు ఉండగా... పురుషులు 10 లక్షల 24వేల 917, మహిళలు 9 లక్షల 43 వేల 171, ఇతరులు 59 మంది ఉన్నారు. ఇక్కడ బీసీ ఓటర్లతో పాటు ముస్లిం ఓటుబ్యాంకు కూడా అధికంగానే ఉంది. లోక్సభ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో నాంపల్లి మినహా అన్ని చోట్ల తెరాసనే గెలిచింది. అక్కడా మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థే గెలిచినందున... ఖాతా తెరిచేందుకు తెరాస ఆరాటపడుతోంది. గతంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ తిరిగి హస్తగతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పట్టున్న సిట్టింగ్ స్థానం, ఇక్కడ 4సార్లు విజయం సాధించిన భాజపా మరోసారి కాషాయ జెండా ఎగురవేయడానికి పావులు కదుపుతోంది.
గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యనేతల పర్యటనలతో నగరంలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఫలితాల మాదిరిగానే తెరాసకు పట్టం కడతారనే విశ్వాసంతో గులాబీ నేతలు ఉన్నారు. జంటనగరాలను మెరుగైన నివాసయోగ్యంగా మార్చడమే కాక... మూసీ నది ప్రక్షాళన చేస్తామని భరోసా ఇస్తున్నారు. మోదీ అనుకూల పవనాలతో ప్రజలు మరోసారి భాజపా వైపే మొగ్గు చూపుతారని కాషాయ నేతలు ధీమాగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎక్కువసార్లు గెలిచిన కాంగ్రెస్కు ఇక్కడ మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇవీ చూడండి:గిరిజన కోటాలో గిరిజనేతరులే కీలకం