ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా అనుమతిలేని ప్లాట్లు, లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారం వివాదస్పదమైంది. ఆదిలాబాద్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధుల్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకొన్న ఓ కీలక అధికారి వ్యూహాత్మకంగా రిజిస్ట్రేషన్ల ఘట్టానికి తెరలేపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ప్రభుత్వం ఆదేశించినా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్‌లు లేని ప్లాట్లతో పాటు అనుమతిలేని ప్లాట్లు, లే అవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని డిసెంబర్ 2020లో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ పాత లే అవుట్లు ఉంటే కనీసం ఒక్కసారైన రిజిస్ట్రేషన్ అయినట్లు లింకు డాక్యుమెంట్లు పొందుపర్చాల్సి ఉండాలని స్పష్టమైన నిబంధనలను సైతం విధించింది. ఆ జీవో జారీఅయిన నుంచి అనుమతిలేని స్థలాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయింది.
సరికొత్త వ్యూహం..
ఆదిలాబాద్‌లో శరవేగంగా సాగుతున్న రూ.కోట్ల లావాదేవీలు జరిగే స్థిరాస్తి వ్యాపారానికి ఇది ప్రతిబంధకంగా మారింది. కానీ కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు సమయం చిక్కినప్పుడల్లా సబ్‌రిజిస్ట్రార్‌లను ప్రసన్నం చేసుకోవడానికి చాపికందనీరులా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇటీవల కొంతమంది వ్యాపారులు పాతిక, ముప్పై సంవత్సరాల కిందటనే.. అప్పట్లో ఉన్న సర్పంచులు లే అవుట్లకు అనుమతి ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి చేసిన ప్రయత్నం సైతం బెడిసికొట్టింది. దాంతో స్థిరాస్తి వ్యాపారులు కొత్త వ్యూహానికి తెరలేపి చకచకా తమ పని పూర్తి చేయించుకున్నారు.
60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు..
ఆదిలాబాద్‌కు చెందిన సబ్‌రిజిస్ట్రార్ ఇమ్రాన్ ఆరోగ్య సమస్యలపై బుధవారం సెలవుపై వెళ్లారు. మరో సబ్‌రిజిస్ట్రార్ చంద్రశేఖర్ విధుల్లో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. దాంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పి.. కార్యాలయంలోని ఓ కిందిస్థాయి ఉద్యోగికి రిజిస్ట్రార్‌కు బాధ్యతలను అప్పగించారు. తద్వారా అనుమతిలేని లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేసే దందాకు తెరలేపడం వ్యాపారులకు కలిసివచ్చినట్లయింది. బినామీ పత్రాలతో దాదాపుగా 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. తమకు అనుకూలమైన సమయం మళ్లీ వస్తుందో..? రాదోననే అనుమానంతో కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు ఎవరికివారు తమ దస్త్రాలను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం సాయంత్రం పోటీపడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసేదాకా వెళ్లింది.
తర్వాత రద్దుచేస్తాం..
కానీ అప్పటికే సంబంధిత సిబ్బంది అనుకున్న రిజిస్ట్రేషన్లన్నీ చేసి వెళ్లిపోవడం అంతా సవ్యంగా జరిగినట్లు చూపించే ప్రయత్నం జరిగింది. బినామీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడంలో అన్ని విధాలుగా అనుభవం ఉన్న ఓ కీలక అధికారికి మరి కొంతమంది కీలకమైన స్థిరాస్తి వ్యాపారుల మధ్య రూ.లక్షల్లో ఒప్పందం జరగడంతోనే.. రిజిస్ట్రార్లు లేని సమయంలో ఈ తతంగానికి తెరలేపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయమై రిజిస్ట్రేషన్ చేసిన జూనియర్ అసిస్టెంట్ విజయ్‌ను 'ఈనాడు-ఈటీవీ భారత్' ప్రతినిధి చరవాణిలో సంప్రదించగా 60 రిజిస్ట్రేషన్లు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. పత్రాలు సరిగాలేనివి ఏవైనా ఉంటే తరువాత రద్దుచేస్తామని వెల్లడించారు. జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్‌ను సంప్రదించగా వ్యాపారుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందన్నారు. ఇమ్రాన్, చంద్రశేఖర్‌లు విధుల్లో లేనందున కింది స్థాయి ఉద్యోగికి రిజిస్ట్రార్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తనకు తెలియదన్నారు. ఎవరైనా స్వయంగా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఇదీచూడండి:అత్త ఇంట్లో కోడలి 'దోపిడీ'.. సోదరుడితో కలిసి కోటి మాయం!