సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాలను ప్రకటించనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(TRS WORKING PRESIDENT KTR) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జిల్లాలపై ఫోకస్ చేసిన గులాబీ పార్టీ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని(ADILABAD DISTRICT) నాలుగు జిల్లాల్లోని సామాజికవర్గాలు, రాజకీయ ప్రాబల్యాలను పరిగణలోకి తీసుకోని జిల్లా రథసారథుల ఎంపిక ఘట్టాన్ని పూర్తిచేయాలని గులాబీ పార్టీ తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఆశించినట్లే అన్నీ అనుకూలిస్తే జిల్లాల నుంచి అధిష్ఠానానికి కేవలం ఒకే పేరును ప్రతిపాదించేలా దిశానిర్ధేశం చేస్తోంది.
సయోధ్య కోసం ప్రయత్నాలు
ఆదిలాబాద్, కుమురంభీం(Komaram Bheem Asifabad district) జిల్లాల్లో గిరిజనులు, ప్రధానంగా ఆదివాసీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ రెండింటిలో ఒక జిల్లాకు ఆదివాసీ అధ్యక్షున్ని ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. కానీ అగ్రనాయకత్వం కుమురంభీం - నిర్మల్(NIRMAL) జిల్లాల మధ్య రాజకీయాలను పరిగణలోకి తీసుకొని సమన్వయం చేసేలా పావులు కదుపుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్(Komaram Bheem Asifabad district) జిల్లాలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ ఆదివాసీలు ఉన్నందున అధ్యక్షస్థానాన్ని గిరిజనేతర వర్గాల్లో వారికో, ఓసీలకో లేదంటే బీసీలకో ఇస్తే బావుంటుందా.? అనేదానిపై ఆలోచన చేస్తోంది.
పార్టీ ఆరాతీస్తున్న ప్రధానాంశాలు
- మండల, నియోజకవర్గస్థాయిలో పార్టీకి దూరమవుతారనుకునేవారి వివరాలు సేకరణ
- పార్టీలోనే ఉంటే కాంగ్రెస్, భాజపాకు దీటుగా పనిచేస్తారా? లేదా.? అనే కోణంలో ఆరా
- పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేసేలా ఇతరులతో లోపాయికారి ఒప్పందం ఉన్నవారు
- వచ్చే ఎన్నికల్లో తనకే ఎమ్మెల్యే టిక్కెట్టు ఖాయమని తమకు తాముగా ప్రకటించుకునేవారి వివరాలు
- వచ్చే ఎన్నికల్లో టికెట్ రానట్లయితే పార్టీలో ఉండి ఏంలాభం అని కామెంట్లు చేసేవారి వివరాలు
ఓసీల మధ్య పోటీ..
నిర్మల్(NIRMAL) జిల్లా పార్టీ పీఠం కోసం ఓసీల మధ్య పోటీ ఉంది. ఇక్కడ ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గం పరిధిలో ఓసీ సామాజిక వర్గాల మధ్య పోటీ ఉంది. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(MINISTER INDRAKARAN REDDY), జడ్పీ ఛైర్‌పర్సన్, తాజాగా డీసీసీబీ ఛైర్మన్ పదవి సహా మిగిలిన కీలకమైన పదవులన్నీ ఈ నియోజకవర్గం నుంచే ఉన్నట్లు పార్టీ గుర్తించింది. అందుకని జిల్లా అధ్యక్షులుగా ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి ఎంపికచేస్తే బావుంటుందనే కోణంలో అగ్రనాయకత్వం ఆరాతీస్తుండటం రాజకీయ ప్రాధాన్యత నెలకొంది. భైంసా, ఖానాపూర్ నుంచి ఓసీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి అధిష్ఠానం ఆమోదముద్ర వేస్తే కుమురంభీం జిల్లా(Komaram Bheem Asifabad district)లో గిరిజనేతర అభ్యర్థులను అధ్యక్షులుగా నియమించే అవకాశం కనిపిస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప.. ఈ సమీకరణాలు పెద్దగా మారే అవకాశం లేదు.