తెలంగాణ

telangana

ETV Bharat / city

మన్యంలో పెద్దపులులు.. వణుకుతున్న ప్రజలు

ఒక్కపులిని చూస్తేనే.. గుండెలు దడదడలాడుతాయి. అలాంటిది.. ఏకంగా మూడు పెద్దపులులు. ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తాయో అని ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.

tigers identified in adilabad rural areas
ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్ని వణికిస్తున్న పులులు

By

Published : Feb 22, 2020, 6:18 PM IST

గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో పెద్దపులులు ఆవాసం కోసం భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలాల్లో సంచరించాయి. పెద్దపులులు డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్థావరాలను మార్చుకుంటాయి. వాటికి అనువైన ఆవాసాల కోసం అన్వేషిస్తుంటాయి. అందులో భాగంగానే గతంలో తిప్పేశ్వర్‌ నుంచి వచ్చిన పెద్దపులి... గోట్కూరి వాగువద్ద, సావర్గాం, బండల్‌ నాగాపూర్‌ ఎర్రమట్టి క్వారీల వద్ద, జందాపూర్‌ గ్రామ సమీపంలోని మాంగనీసు క్వారీ వద్ద సంచరించింది.

సమన్వయ లోపమే ప్రధాన కారణం..

అప్పట్లో తిప్పేశ్వర్‌ నుంచి వచ్చిన పులి మెడలో రేడియేషన్‌ బెల్ట్‌ ఉండడం వల్ల సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర అటవీశాఖ పులి కదలికలు గుర్తించింది. కానీ ఇప్పుడు సంచరిస్తున్న పులులకు రేడియేషన్ బెల్ట్ లేదు. దీంతో పులుల కదలికలు గుర్తించడం కష్టంగా మారింది. పులిని నేరుగా చూసినప్పుడో, మూగజీవాలు మృత్యువాత పడినప్పుడో తప్ప పులి సంచారాన్ని గమనించడం కుదరట్లేదు. పైగా ఇక్కడి అటవీశాఖ అధికారులు- మహారాష్ట్ర అటవీశాఖాధికారుల మధ్య సమన్వయలోపం ప్రజలలో పులిభయం మరింత పెంచుతోంది. ఏ మూల నుంచి పులి దాడి చేస్తుందో అన్న భయంతో.. ప్రజలు పొలాల దగ్గరికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

వేల క్వింటాళ్ల పంట.. పులి పాలయింది!

పులి భయంతో భీంపూర్‌ మండల పరిధిలోని గొల్లఘాట్‌, తాంసి(కె), ఇందూర్‌పల్లి, పిప్పల్‌కోటి, అర్లి(టి), అంతర్‌గావ్‌ శివారులో దాదాపుగా రెండున్నర వేల ఎకరాల్లో పంటను పొలాల్లోనే వదిలేశారు. సూమారు 12,500 క్వింటాళ్ల పత్తి, క్వింటాకు కనీసం రూ.5వేల ధర పలికినా.. రూ.6.25 కోట్లను రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాట దేవుడేరుగు.. ముందు ప్రాణాలకు రక్షణ కల్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.

సిబ్బంది కూడా వణికిపోతున్నారు..

40 మంది సిబ్బందితో.. పెన్‌గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చేపట్టింది. విధులు నిర్వహిస్తున్నారనే మాటేగానీ... అటవీశాఖ సిబ్బంది కూడా పులి భయంతో వణికిపోతున్నారు. పులుల సంచారాన్ని గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరిపడా ఆయుధాలు అందుబాటులోకి లేకపోవడం వల్ల అడవిలోకి వెళ్లాలంటే అటవీ సిబ్బంది కూడా వణికిపోతున్నారు.

రక్షణ కరువైంది...

అటవీ శాఖ అధికారులు తమకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరిస్తూ, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆధికారులు భరోసా.. ఇస్తున్నా.. ప్రజలు మాత్రం పులి భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో పులుల సంచారం, వాటి కదలికలపై సమగ్రమైన అధ్యయనం జరగడంలేదనే ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయం కుదిర్చి ప్రజలకు భరోసా కల్పించాల్సి ఉంది.

ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్ని వణికిస్తున్న పులులు

ఇవీ చూడండి:పూటకో ప్రమాదంతో.. నల్లబడుతున్న నల్లమల

ABOUT THE AUTHOR

...view details