తెలంగాణ

telangana

ETV Bharat / city

MRI Scanning: రిమ్స్‌లోనూ దిక్కులేని ఎంఆర్‌ఐ పరికరం - ఆదిలాబాద్‌ రిమ్స్​

Adilabad MRI Scanning: వైద్యోనారాయణ హరీ అనేది ఆర్యోక్తి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్యోనారాయణ ఏరీ ? అనే దుస్థితి నెలకొంది. వైద్యపోస్టుల భర్తీని పక్కనపెడితే కనీసం అత్యవసర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే MRI లాంటి ఆధునిక పరికరాలు సమకూరడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాలకులు ప్రకటించడమే తప్ప... క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో MRI పరీక్ష అంటేనే ప్రాణాలను అంబులెన్సులో పెట్టుకొని హైదరాబాద్‌కో, మహారాష్ట్రకో పరుగులు పెట్టాల్సి వస్తోంది.

MRI Scanning
MRI Scanning

By

Published : Feb 9, 2022, 5:48 AM IST

రిమ్స్‌లోనూ దిక్కులేని ఎంఆర్‌ఐ పరికరం

MRI Scanning in Adilabad RIMS: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జనాభా దాదాపుగా 28లక్షలు. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలుగా అవతరించింది. పాత డివిజన్‌ కేంద్రాల్లోని ప్రాంతీయ ఆసుపత్రులనే ప్రభుత్వం... జిల్లా ఆసుపత్రులుగా మార్చింది. సరిపడా వైద్యులు, అందుకు అనుగుణంగా ఆధునిక వైద్యపరికరాలను మాత్రం సమకూర్చనేలేదు. ఆదిలాబాద్‌ కేంద్రంగా 2008లో ఏర్పాటైన రిమ్స్‌(RIMS) వైద్య కళాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 150కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఏర్పాటు చేశాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా రిమ్స్‌ తయారైంది. కనీసం ఎంఆర్‌ఐ పరికరాన్ని సమకూర్చలేదు. ఇక వైద్యనిపుణుల భర్తీ జాడే లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు MRI పరీక్ష అవసరమైతే... వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆదిలాబాద్ వాసులు ఆరోపిస్తున్నారు.

సమావేశాలు నిర్వహిస్తే... రోగుల బాధలు తెలిసేవి

ఆదిలాబాద్‌ రిమ్స్‌, దాని అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు..నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఎంఆర్‌ఐ పరికరం లేదు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో క్రమం తప్పకుండా ఆసుపత్రుల సలహా సంఘం సమావేశాలు నిర్వహిస్తే... రోగుల బాధలు అధికారులకు తెలిసేవి. కానీ అలాంటి సమీక్షా సమావేశాలు జరగడమే లేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లో వెల్లడి కాని... లక్షణాలన్నీ ఎంఆర్‌ఐ పరీక్షల్లో తెలుసుకునే వీలుకలుగుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఎంఆర్‌ఐ పరికరం... ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేకపోవడమంటేనే ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది వెల్లడవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు MRI పరికరం ఆవశ్యకతను ప్రస్తావించకపోవడం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రోగులకు సంకటంగా మారింది.

ఇదీ చూడండి:Ts High Court: వివిధ అంశాలపై అందిన లేఖలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details