Student died with snake bite : ఎంతో ప్రేమగా చూసుకుంటూ.. ఉన్నత చదువులు చదివించి గొప్ప స్థానంలో చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఎంతో కష్టపడి ఇంటర్ పూర్తి చేసి.. డిగ్రీ చదువుతున్న ఆ అమ్మాయిని పాము రూపంలో మృత్యువు మింగేసింది. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
Snake bite : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన రైతు భలేరావు సుభాష్ ఏకైక కుమార్తె ప్రణాళి (18). ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటేసింది. కుటుంబీకులు వైద్యం కోసం దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొనిఉండగా పాముకాటుకు గురైంది. చికిత్సతో తిరిగి కోలుకుంది.
అప్పటినుంచి తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బయటకు ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా స్నేహితులపై చల్లుదామని తన కళాశాల బ్యాగ్‌లో ఉన్న రంగులను తీయబోతుండగా అందులోని పాము ఒక్కసారిగా కాటు వేసింది. కుటుంబీకులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూసింది. ఒక్కగానొక కుమార్తె మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేసిందంటూ కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:పెళ్లి కావడం లేదని భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య