తెలంగాణ

telangana

ETV Bharat / city

swine flu cases in Adilabad ఆదిలాబాద్​ జిల్లాలో స్వైన్​ఫ్లూ కేసులు - ఆదిలాబాద్​లో స్వైన్ ఫ్లూ కేసులు

swine flu cases in Adilabad పల్లెల నుంచి దవాఖానా బాట పడుతున్న జనం. రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి. రోగాలతో యుద్ధం చేస్తున్న చిన్నారులు. మాట్లాడలేని స్థితిలో మంచం పట్టి అవస్థలు. ఇదంతా రిమ్స్‌లో కనిపిస్తున్న దయనీయ దృశ్యాలు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో యువత, పిల్లలు ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత కలవర పెడుతోంది.

swine flu cases in Adilabad
swine flu cases in Adilabad

By

Published : Aug 24, 2022, 12:08 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో స్వైన్​ఫ్లూ కేసులు

swine flu cases in Adilabad : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ఇబ్బందుల నుంచి కోలుకోకముందే... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్‌, తాంసి మండలాల్లో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజు వ్యవధిలో తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో మంచం పడుతున్నారు. కంటిచూపు మందగించడంతో కుటుంబసభ్యులు కలవర పడుతున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌తోపాటు ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, జైనూర్‌, నేరడిగొండ, సిరికొండ, బోథ్‌ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది.

swine flu cases in Adilabad RIMS : రిమ్స్‌ ఆస్పత్రికి రోజుకు సగటున 1800మంది రోగులు రావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ప్రధానంగా పిల్లలు, యువతకు ఉన్నట్టుండి... జ్వరం సోకడం, కంటిచూపు మందగించడం, కాళ్లూచేతుల్లో కదలిక లేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటి.. లక్షణాలతో మంచంపట్టడం సర్వసాధారణంగా మారింది. రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. గతం కంటే భిన్నంగా వ్యాధుల తీవ్రత ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో రిమ్స్‌ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. అధిక సంఖ్యలో పేదలు వస్తుండడంతో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ కోరుతున్నారు.

"ఉన్నట్టుండి ఏటెటో చేసిండు. కళ్లు పైపైకి అనుడు. ఎటెటో చూసుడు. కళ్లు కూడా చిన్నగైనయి. కళ్లు సరిగ్గా కనిపిస్తలేవు. నడవడానికి కూడా వస్తలేదు. భయమై తొందరగా ఆస్పత్రికి తీసుకొచ్చినం. ఇక్కడ ఇదే సమస్యతో చాలా మంది ఉన్నారు. బాగా జ్వరం వచ్చింది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గలేదు. ఆస్పత్రికి తీసుకపోదాం అనుకునేలోపే ఎటెటో చేసుడు చేసిండు. డాక్టర్లేమో స్వైన్ ఫ్లూ అని చెబుతున్నారు. ఈ పేరు విన్నంక మా గుండెల మీద బండ పడినట్లైంది. ఇక్కడ అందరు పిల్లలే ఉన్నరు. పిల్లలకే ఇది ఎక్కువ వస్తంది. డాక్టర్లు ఏం చెబుతలేరు. మా పిల్లలకేం అయితదోనని భయంగా ఉంది." అని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

"వ్యాధుల తీవ్రత గతం కంటే భిన్నంగా ఉంది. గత వానాకాలంలో కేవలం జ్వరం కేసులు మాత్రమే వచ్చాయి. కానీ ఈ సారి వేర్వేరు లక్షణాలున్నాయి. చాలా వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం మేం వాళ్లకి ఫీవర్ ట్రీట్​మెంట్ ఇస్తున్నాం. వాళ్లకి వచ్చిన వ్యాధేంటో ఇంకా పరీక్షలు చేస్తున్నాం." అని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు.

అకాల వర్షాల లాగే అకాల వ్యాధులు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం వచ్చిందంటే జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కట్టే ప్రజలు ఇప్పుడు వివిధ రకాల లక్షణాలతో ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులేమో వాళ్లని చేర్చుకోవడం లేదు. ప్రభుత్వాస్పత్రిలో ఆ లక్షణాలకు ఎలాంటి చికిత్స అందించాలనేదానిపై వైద్యులు తర్జనభర్జన పడుతున్నారు. తమ పిల్లలకు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ స్పందించి తమ పిల్లల వ్యాధేంటో కనుగొని సరైన చికిత్స అందించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details