Bala Kendram in Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాల కేంద్రం ఇది. నెలరోజులుగా ఇక్కడ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కరోనాతో ఇంటిపట్టునే ఉంటున్న విద్యార్థులు సెల్‌ఫోన్ వీడాలంటే వారికి కళల పట్ల అభిరుచి పెంచడమే మార్గమని భావిస్తున్నారు తల్లిదండ్రులు. అలా భావించడమే తరువాయి ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలను బాలకేంద్రం బాట పట్టిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతోపాటు... సంగీతం, తబలా, హర్మోనియం, పియానో వంటి వాయిద్యాలను వాయించడమెలాగో ఇక్కడ నేర్పిస్తున్నారు.
అంతేకాదు ఆత్మరక్షణ కోసం కరాటేలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేలా చిత్రలేఖనంలోనూ.... బాల, బాలికలను తర్ఫీదునిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఉచిత శిక్షణా శిబిరానికి హాజరవుతున్న వందలాది మంది విద్యార్థులు.. ఆయా అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సైతం తన నాలుగేళ్ల కుమారుడు... సారంగ్‌ని బాల కేంద్రానికే పంపిస్తున్నారంటే ఇక్కడి సిబ్బంది ఇస్తున్న శిక్షణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ బాలుడు చిత్రలేఖనంతో పాటు కరాటేలో ఆసక్తి చూపుతూ... ఇతర విద్యార్థుల మాదిరిగానే వచ్చి తర్ఫీదు పొందుతున్నాడు.