Basara RGUKT : దేశంలో ఏడేళ్లకు పైగా శాశ్వత ఉపకులపతి లేని ఏకైక విశ్వవిద్యాలయంగా బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) విమర్శల పాలవుతోంది. శాశ్వత ఉపకులపతిని నియమించాలన్నది విద్యార్థుల 12 డిమాండ్లలో ఒకటి. ఈ వర్సిటీకి 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు అయిదేళ్ల పాటు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన ఆచార్య ఆర్‌వీ రాజకుమార్ ఉపకులపతిగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. రాజకుమార్ పదవీకాలం ముగిసిన అనంతరం రెండేళ్ల పాటు ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ ఇన్‌ఛార్జి ఉపకులపతిగా పనిచేశారు.
2017 సెప్టెంబరులో అప్పటి ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ను ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీగా నియమించింది. ఆయన 2020 ఫిబ్రవరి వరకు పనిచేశారు. ఆ స్థానంలో ప్రస్తుతం సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న రాహుల్ బొజ్జాను నియమించారు. ఆయన నియమితులై రెండేళ్లు కావొస్తున్నా ఒకే ఒకసారి వచ్చి వెళ్లారని వర్సిటీ వర్గాలు, విద్యార్థులు చెబుతున్నారు. గత ఏడాది న్యాక్ బృందం వర్సిటీకి వచ్చినప్పుడు రాహుల్ బొజ్జా హాజరయ్యారు. తాజాగా మంత్రి వెంట వర్సిటీకి వచ్చారు. గత అయిదేళ్లుగా ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల వారు వర్సిటీకి సమయం కేటాయించలేని పరిస్థితి. న్యాక్ బృందం కూడా శాశ్వత వీసీని నియమించాలని సూచించినట్లు తెలిసింది. ‘ఒకటీ రెండేళ్లు శాశ్వత వీసీలు లేని వర్సిటీలు ఉన్నాయి గానీ.. ఇలా ఏడేళ్లకుపైగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల్లేవు’’ అని సెంట్రల్ వర్సిటీ మాజీ వీసీతో పాటు ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారాయణ అంటున్నారు. ఆర్‌జీయూకేటీ మాజీ డీన్ సహా పలువురు ఆచార్యులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.
*దేశంలో 401 వర్సిటీలకు న్యాక్ గుర్తింపు ఉంది. అందులో 223కు ‘ఏ’, ఏ ఫ్లస్, 162కు ‘బి’ గ్రేడ్ ఉండగా...కేవలం 16 వర్సిటీలకే ‘సి’ గ్రేడ్ దక్కింది. అందులో ఆర్‌జీయూకేటీ కూడా ఒకటి కావడం గమనార్హం. రాష్ట్రంలో 15 వర్సిటీలకు న్యాక్ గ్రేడ్‌లుండగా...‘సి’ గ్రేడ్ పొందిన వర్సిటీ ఇదొక్కటే.