తెలంగాణ

telangana

ETV Bharat / city

మావోలపై డేగకన్ను.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై... పోలీసు యంత్రాంగం డేగకన్నుతో పరిశీలిస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కడంబా ఎన్‌కౌంటర్ తరువాత నక్సల్స్​ కవ్వింపు చర్యలకు పాల్పడతారా..? వారికి అనుకూలమైన ప్రాంతాలేవీ అనే కోణంలో దృష్టి సారించింది.

police special focus on maoists movement in adilabad forests
మావోలపై డేగకన్ను.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు

By

Published : Sep 24, 2020, 9:17 AM IST

ఉత్తర తెలంగాణలో ఒకప్పటి పీపుల్స్‌వార్‌కు ప్రయోగశాలగా ఉన్న ఉమ్మడి ఆదిలబాద్‌ జిల్లాలో మళ్లీ అలజడి ప్రారంభమైంది. 2010లో మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌గోపాల్‌ అలియాస్‌ ఆజాద్ సహా జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ తరువాత... ఈ నెల 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్​‌కు చెందిన చుక్కాలు, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాజీరావు మరణించడం... ఆదివాసీ పల్లెలను ఉలిక్కిపడేలా చేసింది. పెన్‌గంగ, ప్రాణహిత నదీ పరివాహాక ప్రాంతంతోపాటు కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్‌, తిర్యాణి, పెంచికల్‌పేట, బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి) అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసు యంత్రాంగం... సమాచారం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కారిడార్‌ ప్రాంతంగా ఉన్న ఖానాపూర్‌, పెంబి, కడెం, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, బోథ్‌ అటవీ ప్రాంతాల్లోనూ... పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 500పైగా సాయుధ బలగాల కదలికలతో ఆదివాసీలు కలవరానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టున్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలోని దళం... నూతన నియమాకాలు చేస్తున్నట్టు సమాచారం. నిఘా వర్గాల ద్వారా పసిగట్టిన పోలీసు యంత్రాంగం అడ్డుకునే వ్యూహరచన చేస్తోంది. ఇటీవలి కాలంలో 10 నుంచి 15 మంది వరకు ఆదివాసీ యువత మావోయిస్టుల్లో చేరినట్టు తొలుత భావించింది. కానీ తాజా పరిణామాల అనంతరం దాదాపు 40 నుంచి 50 మంది చేరినట్టు అంచనా వేస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా అల్లంపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రభుత్వం... ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంక్షేమం కోసం 14 అంశాలతో అభివృద్ధి ప్రణాళిక రచించింది. కానీ నేటికీ అది అమలు కాలేదు. పైగా నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రాజ్యాంగం ఫలాలు పొందలేకపోతున్నామనే... అసంతృప్తే యువత ప్రణాలు పోగొట్టుకునేలా చేస్తుందనే ఆదివాసీల ఆవేదనకు సమాధానం లభించడం లేదు. కడంబా ఎన్‌కౌంటర్‌ తరువాత నక్సల్స్‌ ఎదురుదాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసు యంత్రాంగం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నేతలతోపాటు వారి అంగరక్షకులను సైతం అప్రమత్తం చేసింది. అత్యవసరమనుకుంటే తప్ప మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని నేతలకు సూచిస్తుండటం ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోంది.

ఇదీ చూడండి:కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details