ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంక్రాంతి పండగ శోభ కనిపించడంలేదు. రైతుల్లో మునుపటి ఆనందం అగుపించట్లేదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.70లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉంటే... 3.5 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. మరో లక్షా 25వేల ఎకరాల్లో సోయా పంట సాగైంది. ఖరీఫ్ ఆరంభంలో వానలు అనుకూలంగానే కురిసినా... ఆ తరువాత ముఖం చాటేశాయి. ఈ ప్రభావంతో ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి రావటం వల్ల ప్రతి రైతుపై రెట్టింపు భారం పడింది. బీటీ అనే ఒకే మాట తప్ప... వాటి తయారి కంపెనీ ఏదీ..? విత్తన నాణ్యత ఏమిటీ...? అనే అంశాలను వ్యవసాయశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల మొక్కదశలోనే రైతులు ఒకటికి రెండుసార్లు నష్టపోవాల్సి వచ్చింది. దానికితోడు గులాబీ రంగు, కాయకుళ్లు తెగులు ఆవరించటం వల్ల ఎకరాకు రూ. 20వేలు పెట్టుబడి నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. అయినా... అశించిన దిగుబడి రాలేదు.
సగం కూడా రాలేదు...
తొలుత ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, తాంసి, ఆదిలాబాద్, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్ మండలాల్లో ప్రారంభమైన కాయకుళ్లు తెగులు తరువాత ఉమ్మడి జిల్లా అంతటా విస్తరించింది. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి... ఐదు క్వింటాళ్లకు మించడం గగనమైపోయింది. ప్రభుత్వ సూచనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మంది రైతుల్లో దాదాపుగా 3.50 లక్షల మంది రైతులు పత్తి సాగు చేసినప్పటికీ.. ఆశించిన దిగుబడి రాక.. కాలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా రైతు కుటుంబాల్లో సంక్రాంతి పండగ సంబురం ఆవిరైంది. పలకరిస్తే నిర్వేదపూరితమైన వేదననే వినిపిస్తోంది.