తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర - nagoba jathara

ఆదివాసీల ఆచార వ్యవహారాల పండుగ... నాగోబా జాతర నేటి అర్ధరాత్రి సంప్రదాయ పూజల మధ్య అట్టహాసంగా ప్రారంభం కానుంది. పక్షం రోజులుగా సాగుతున్న మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్‌ చేరుకుంది. మర్రిచెట్టు నీడన సేదదీరిన ఆదివాసీలు... నేటి అర్ధరాత్రి నాగదేవతకు గంగా జలంతో అభిషేకం చేసి మహాక్రతువును ప్రారంభించనున్నారు.

nagoba jathara starts from today night inn Adilabad
నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర

By

Published : Feb 11, 2021, 7:55 AM IST

నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర

నాగోబా జాతర ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. నాగోబా జాతర పండుగతో మెస్రం వంశస్థుల జీవన విధానం ముడిపడి ఉంది. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు ఈ జాతర తలమానికంగా నిలుస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయులు... నాగోబా జాతరతో ఆదిలాబాద్​ జిల్లాలోని కేస్లాపూర్‌లో కలవాలనేది ఆచారం. ఎడ్లబళ్లపై వచ్చి చెట్టు నీడన సేదదీరుతారు. గోదావరి నదికి పదిహేను రోజులపాటు కాలినడకన వెళ్లి.. మట్టి కుండల్లో తెచ్చే గంగాజలంతో... అర్ధరాత్రి తుడుం మోతలు, సన్నాయి వాయిద్యాల మధ్య నాగోబా దేవతకు అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. నాగోబా సన్నిధిలో బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే... పెళ్లైన మహిళలకు మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే కాలం చేసినవారికి మోక్షం లభిస్తుంది.

మూడున్నర కోట్ల రూపాయల స్వచ్ఛంద విరాళాలతో నూతనంగా నిర్మితమవుతున్న గర్భగుడిలో మహాపూజ క్రతువు జరగనుంది. ఏటా కేస్లాపూర్‌ వేదికగా ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే అధికార దర్బార్‌ను ఈ ఏడాది కరోనా కారణంగా నిర్వహించడం లేదు. మెస్రం వంశీయుల సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీడీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

అక్షరాస్యులైనా.. నిరక్ష్యరాస్యులైనా... చిన్నపిల్లలైనా... జీవిత చిరమాంకంలో ఉన్న వృద్ధులైనా... ఇక్కడ అంతా సమానులనే భావన కనిపిస్తుంది. ఎంత నిష్టతో పూజలు చేస్తే జనావళికి అంత మేలు జరుగుతుందనేది మెస్రం వంశీయుల విశ్వాసం.

ABOUT THE AUTHOR

...view details