కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా కురుస్తున్న వానలతో... కొన్ని గ్రామాలు ఇప్పటికీ జల దిగ్భందంలోనే ఉన్నాయి. వాగులు ఉప్పొంగడంతో దాటి రాలేని పరిస్థితులను.. అక్కడి గ్రామస్థులు ఎదుర్కొంటున్నారు. అడదస్నాపూర్ పంచాయతీ పరిధిలోని సంతోషగూడ, వాడి లొద్ది, చిల్కగూడ వాగు అవతల ఉన్నాయి. అత్యవసరమైతే కొంత మంది ధైర్యం చేసి వాగు దాటి సరకులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. మిగతా పనులేవీ చేసుకోలేక ఇళ్ల వద్దే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
మానవత్వం చాటుకున్న ప్రజాప్రతినిధులు.. వాగు దాటి సరుకుల పంపిణీ.. - కేటీఆర్ జన్మదిన వేడుకలు
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. నిత్యావసర సరకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకు వెళ్లి.. సాయం చేసి భరోసా కల్పించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పలువురు స్థానిక ప్రతినిధులు వాగు దాటి వరద బాధితులకు సాయం చేశారు.
మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని.. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్.. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు వాగుదాటి గూడాలకు వెళ్లి నిత్యావసర సరకులు అందజేశారు. వారం రోజులుగా ఇళ్లకే పరిమితమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకలకు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా వాగులపై వంతెనలు ఏర్పాటు చేయాలని స్థానికులు... స్థానిక శాసనసభ్యులను కోరారు.
ఇవీ చదవండి: