చుట్టూ నీళ్లు.. కానీ.. తాగడానికి గుక్కెడు మంచినీరు లేదు - ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం
Flood effect on Adilabad district : వరద ప్రభావం ఆదిలాబాద్ జిల్లాను ఇంకా వీడలేదు. చుట్టూనీళ్లున్నా.. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. జిల్లాలోని పలు పల్లెల్లో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం అవ్వడం వల్ల తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని భూపాలపల్లి, ఆసిఫాబాద్, నల్గొండ వంటి పలు జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి దుస్థితే ఉంది.
Flood effect on Adilabad district
By
Published : Jul 19, 2022, 7:25 AM IST
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ పంచాయతీ పరిధిలోని జైత్రం తండా వాగులో కొట్టుకుపోయిన మిషన్ భగీరథ పైపులివి. దీంతో పంచాయతీ పరిధిలోని గొట్టి, గొట్టిపటార్, నర్సాపూర్, జైత్రంతండా ఆదివాసీ పల్లెలతో పాటు దంతన్‌పల్లి పంచాయతీ పరిధిలోని మారుగూడ, నర్సాపూర్(జి), బిర్సాయిపేట, హీరాపూర్, ఏందా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలం మందపల్లి గ్రామ సమీపంలోని ఊరకుంట చెరువుకు గండి పడటంతో మిషన్ భగీరథ పైపులైన్ తెగిపోయింది. ఫలితంగా పసుపుల, హరిచంద్‌తండా, తులిసీపేట్, దయ్యాలమద్ది, గట్టిగూడెం, మందపల్లి గ్రామాలకు నీటిసరఫరా నిలిచిపోయింది.
Flood effect on Adilabad district : చుట్టూ నీళ్లు.. అయినా గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు మంచినీరూ కరవు.. మిషన్ భగీరథ పథకం పైపులైన్లు ధ్వంసమవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు పల్లెల్లో నెలకొన్న దైన్యమిది. సుమారు ఏడు జిల్లాల పరిధిలోని 2వేలకు పైగా గ్రామాలకు గత వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తుండగా.. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు చేతిపంపులు, బావులు, చెలమలే దిక్కుగా మారాయి.
Mission Bhagiratha Pipeline Damage : కొన్నిచోట్ల వరద ప్రవాహం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పైపులైన్ల ధ్వంసం, వరద నష్టాలపై మిషన్ భగీరథ అధికారులు అంచనాలు వేస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులు చేసి.. తాత్కాలికంగా సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల నష్టం ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయి పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టే అవకాశముందని క్షేత్రస్థాయి అధికార వర్గాలు చెబుతున్నాయి.
ధ్వంసమైన పైపులైన్లు..ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ, సాత్నాల, పెద్దవాగు పొంగిపొర్లడంతో పైపులైన్ దెబ్బతింది. జైనథ్, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, బోథ్ వంటి ఏజెన్సీ మండలాల్లోని 80 గ్రామాలకు నీటి సరఫరా నిలిచింది. తాత్కాలికంగా 50 గ్రామాలకు పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు శుద్ధజలం అందించే పరిస్థితి లేదు.
భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం పెద్దంపేట వాగు పొంగిపొర్లడంతో అప్రోచ్ రోడ్డు సహా భగీరథ పైపులైన్ ధ్వంసమైంది. పైపులైన్‌లో కొంతభాగం కొట్టుకుపోయింది. మంథని, భూపాలపల్లి మిషన్ భగీరథ సెగ్మెంట్‌లో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచింది. వరద పూర్తిగా తగ్గిన తరువాత మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
మహాముత్తారం పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో పది రోజులుగా సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు మూడు రోజులు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘వారం రోజులుగా కరెంటు లేదు. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పాతబావులు, చెలమల నుంచి నీటిని తోడుకుని తాగుతున్నాం’’ అని భూపాలపల్లి జిల్లా పలిమెలకు చెందిన అమృత తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో అనార్‌పల్లి, పరసువాడ వాగుల వద్ద పైపులైన్ ధ్వంసమైంది. అక్కడ వారం రోజులుగా సరఫరా నిలిచిపోయింది. పైపులైన్లకు మరమ్మతులు చేస్తున్నారు. ప్రజలు చేతిపంపులు, బావుల నీటిని వాడుకుంటున్నారు.
కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో వాగులు ఉప్పొంగి భగీరథ పైపులైన్లు ధ్వంసమయ్యాయి. ఎఫ్‌టీఎల్‌కు మించి వరద రావడంతో ఇన్‌టేక్ వెల్‌లోకి నీళ్లొచ్చాయి. నీటిని పంపు చేసేందుకు నిర్మించిన సబ్‌స్టేషన్ నీటమునిగింది. దీన్ని తాత్కాలికంగా పునరుద్ధరించారు. కడెం మండలం పాండ్వాపూర్ వద్ద వంతెన వెంబడి వేసిన మిషన్ భగీరథ పైపులైన్ 600 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో కడెం మండలంలోని 20, దస్తురాబాద్ మండలంలోని 28, జన్నారం మండలంలో 73 గ్రామాలకు భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ఖానాపూర్, పెంబి మండలాలు సహా మిగిలిన మైదాన ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకుంటే 204 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. ఆరు రోజులుగా నీళ్లు లేవని, తాగునీటి డబ్బాలు కొనుగోలు చేసి తాగుతున్నామని పాండ్వాపూర్‌కు చెందిన గోపి తెలిపారు.
నల్గొండ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కొన్నిచోట్ల పైపులైన్ దెబ్బతింది. అధికారులు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు.
చేతిపంపులు, బావుల నీరే గతి.. మిషన్ భగీరథ సరఫరా వారం రోజులుగా నిలిచిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో చేతిపంపులు, బావుల్లోని నీరు తాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెలమలు తీసి, అందులో ఊరిన నీటిని వినియోగిస్తున్నారు. కొత్తనీరు చేరడంతో చేతిపంపుల్లో రంగుమారిన నీరు వస్తోంది. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్, డయేరియా ప్రబలుతుంటాయి. పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీటి డబ్బాలు కొనుగోలు చేస్తున్నారు. 20 లీటర్ల డబ్బాకు రూ.15-20 వరకు వెచ్చిస్తున్నారు.