KTR Basara Tour: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ విద్యార్థులతో నేరుగా మాట్లాడడానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. జూన్ 20న మంత్రి సబితా హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.
గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని ఐటీ, పారిశ్రామిక మంత్రి కేటీఆర్ కొనియాడారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులే ఆందోళన చేయడం నచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా 'మీ అంతట మీరే ఆందోళన' బాగుందని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ జోగురామన్న కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
నవంబర్‌లో అందరికీ ల్యాప్‌టాప్‌లు.. '2 నెలల తర్వాత సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడికి తీసుకొస్తా. నవంబర్‌లో అందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తాం. మళ్లీ వచ్చేసరికి ఆర్జీయూకేటీ ఆడిటోరియంలో మార్పులు చేయాలి. మీ ఆందోళనలు పత్రికలు, టీవీల్లో చూస్తునే ఉన్నా. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మీ అంతట మీరే ఆందోళన చేశారు. విద్యావ్యవస్థను కొవిడ్ అతలాకుతలం చేసేసింది. భవన నిర్మాణం చేయడం తేలిక, వసతుల నిర్వహణ సవాల్‌తో కూడుకున్నది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.