Movement of Maoists: మావోయిస్టు దళ సభ్యులు ప్రాణహిత నది మీదుగా ప్రవేశించి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు దళాలు వారం రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నాయి. గ్రామస్థులను, గ్రామ పటేళ్లు, పెద్ద మనుషులను కలిసి వీరికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు, మావోయిస్టులు ఎవరైనా కనిపించినా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లుగా మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ దళం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంచరిస్తూ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు.
నాలుగైదు రోజుల క్రితం ప్రాణహిత నది దాటి జిల్లాలోకి మావోయిస్టుల బృందం ప్రవేశించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిర్పూర్ టి, బెజ్జూరు, దహెగం, పెంచికల్పేట్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లోనూ, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు మావోయిస్టులు ఎవరికైనా కనిపించారా అని ఆరా తీస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పల్లె ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గతంలో చోటు చేసుకున్న సంఘటనలు..2020 సెప్టెంబర్ నెలలో డిజిపి మహేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు ఉంటూ మావోయిస్టులను పట్టుకునేందుకు వ్యూహరచన చేశారు. ఇదే నెలలో డిజిపి రెండుసార్లు జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో తిర్యాని మండలం తొక్కిగూడలో ఎదురుకాల్పులు సైతం చోటు చేసుకోగా ఎవరికి గాయాలు కాలేదు. అక్కడ లభించిన డైరీ వివరాల ఆధారంగా 11 మంది మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు, టోకీగూడ గ్రామ పటేళ్లను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. 2020 సెప్టెంబర్ నెలలోనే కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ నెలలోనే పెంచికల్ పేటకు చెందిన ఆరుగురు వ్యక్తులు మావోయిస్టుల్లో చేరడానికి సన్నద్ధమయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.