కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లింగాపూర్ మండలం లొద్దిగూడ, వంజరి గూడలో కిడ్నీ వ్యాధి ప్రబలి... రెండు గ్రామాల్లో దాదాపు 40 మంది అవస్థ పడుతున్నారు. 2017లో హైదరాబాద్ నిమ్స్ వైద్యులు, అధికారులు ఇక్కడ వైద్య శిబిరాలు నిర్వహించి ఈ రెండు గ్రామాల్లోని ప్రజలకు వ్యాధి సోకుతుందని నిర్ధారించారు. వ్యాధి సోకడానికి కారణం సురక్షిత మంచినీరు లేకపోవడమే అని తేల్చారు. లొద్దిగూడ గ్రామాన్ని అక్కడినుంచి తరలించి, అందరికీ రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని అప్పటి పాలనాధికారి చంపాలాల్ హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేసినా ప్రస్తుతం పని చేయడం లేదు.
నీళ్లు లేవు.. రోడ్లు లేవు..
లింగాపూర్ మండలంలోని మారుమూల గ్రామం ఖీమానాయక్ తండాలో సైతం కిడ్నీ వ్యాధి విస్తరిస్తోంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 12 మంది బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు పర్యటించి జైనూర్ వెళ్లాలి. లేదంటే.. 25 కిలోమీటర్లు తిరిగి తిర్యాని మండలంలోని గిన్నెధరి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు తెగి.. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత మంచి నీరు అందించడం కోసం.. ఏర్పాటు చేసిన భగీరథ నీళ్లు కూడా రంగుమారి రావడం వల్ల ప్రజలు బావి నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్ల వల్ల.. కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామానికి చెందిన జాదవ్ సజ్జన్‌లాల్ అనే వ్యక్తిని కిడ్నీ వ్యాధితో నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.
పనులు చేసుకోలేకపోతున్నాం..
నిత్యం కూలిపనులకు, పొలాల దగ్గర వ్యవసాయ పనులు చేసుకునే వారే ఆ ప్రాంతంలో ఎక్కువ. కిడ్నీ వ్యాధి వల్ల ఎక్కువ సేపు పని చేస్తే.. వెన్నుముకలో తీవ్రమైన నొప్పి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నొప్పి భరించలేక అసలు పనులకే వెళ్లలేక పోతున్నామని.. పూట గడవటం చాలా కష్టంగా ఉందన ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వ్యాధిగస్తులు, గ్రామప్రజలు వేడుకుంటున్నారు.