ఆదిలాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి అక్రమాల్లో రోజుకో కోణం బయటపడుతోంది. ఇప్పటికే నేరెడిగొండ, బజార్‌హత్నూర్, బోథ్, గుడిహత్నూర్, మావల మండలాల పరిధిలో... 111 మంది బినామీ లబ్దిదారులు అధికారుల కన్నుగప్పి... కల్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీరిలో 87 మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు వెల్లడైంది. అప్రమత్తమైన అధికారులు... మండలాలవారీగా 2019 నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి అర్హులు, అనర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది.
రంగంలోకి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
అక్రమాలను బయట పెట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్ మండలాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విచారణ ప్రారంభించారు. కల్యాణలక్ష్మి పథకంలో అవినీతికి పాల్పడ్డవారిలో అచ్యుత్, శ్రీనివాస్ జాదవ్, నరేందర్ సహా మిస్టర్ ఎం, మిస్టర్ కే.... అనే మరో ఇద్దరు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. బ్యాంకు ఖాతాలో పూర్తి పేరు లేకుండా రెండు ఖాతాల్లో నగదు జమ అయినట్లు అధికారులు చెప్పారు. ప్రింటింగ్ సమస్యా లేదా పూర్తి పేరు నమోదు చేయలేదా అని అధికారులు విచారణ జరుపుతున్నారు.