ఆదిలాబాద్‌లో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన 247 పోస్టుల భర్తీకి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతులిచ్చింది. కార్మికశాఖలో నమోదు జాబితా ప్రకారం 20 పొరుగు సేవల ఏజెన్సీలున్నా... యంత్రాంగం మాత్రం ఏకపక్షంగా మూడింటినే ఎంపికచేసింది. దరఖాస్తుల స్వీకరణ వాటి ఆధ్వర్యంలో సాగింది. రూల్ ఆఫ్ రోస్టర్, జోనల్ రిజర్వేషన్ల ప్రకారం... 203 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఇటీవలే ప్రకటించారు. వారిలో కేవలం 157 మంది మాత్రమే విధుల్లో చేరారు. మిగిలిన 46 మంది జాడలేదు. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉన్న నేటి రోజుల్లో 46 మంది విధుల్లో చేరకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఎంపికైన విషయం తెలియక అభ్యర్థులకు విధుల్లో చేరలేదా? సమాచారం ఇవ్వకుండా మధ్యవర్తులు డబ్బుల కోసం పావులు కదుపుతున్నారా....? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి ఎంపికైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిడిగూడకు చెందిన ఆదివాసీ అభ్యర్థి సారికను ఏజెన్సీ నిర్వహకులు విధుల్లో చేర్చుకోలేదు. జిల్లాల పునర్విభజనకంటే ముందు ఆసిఫాబాద్ గిరిజన గురుకుల పాఠశాలలో చదవుకున్న ఆమెను... నాన్‌లోకల్‌గా పేర్కొని తిరస్కరించడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో స్టాఫ్‌నర్సుగా ఎంపికైన నిర్మల్ జిల్లాకు చెందిన మరో ముగ్గురి నుంచి ఓ మధ్యవర్తి లక్ష నుంచి లక్షన్నర వరకు డబ్బులిస్తే ఉద్యోగం వస్తుందని బురిడీ కొట్టించేందుకు చేసిన ఫోన్ కాల్‌కు సంబంధించిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో స్వయంగా తెరాస నేతలే అభ్యంతరం వ్యక్తం చేయటం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
జేఎన్ఎం ఔట్సోర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేశాను. మెరిట్ ప్రకారం నాకు ఉద్యోగం వచ్చింది. ఫైనల్ లిస్ట్‌లో కూడా నా పేరు ఉంది. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు కూడా నా సర్టిఫికెట్లు జీరాక్స్ తీసుకున్నారు. ఫోన్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేయలేదు. విషయం ఏమిటోనని తెలుసుకుందామని ఏజెన్సీ వద్దకు వచ్చాము. మీది మంచిర్యాల జిల్లాకు వస్తుంది. మీరు అర్హులు కాదని చెబుతున్నారు. వాస్తవానికి మాది ఆదిలాబాద్ జిల్లానే. డబ్బుల కోసం వాళ్లు నాన్‌లోకల్ అని చెబుతున్నారు. -సారిక, బాధితురాలు