అధిక వర్షాలు, వరదలు రైతులను నిండా ముంచాయి. ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్నదాతల దీనావస్థ వర్ణనాతీతంగా ఉంది. వరదలో మునిగి నాశనమైన పైర్లు, నార్లు ఒకవైపు.. ఇసుక, బురద, రాళ్ల మేటలతో నామరూపాల్లేకుండా పోయిన పొలాలు మరోవైపు.. వీటిని చూసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పంట దెబ్బతినడం కన్నా ఇసుక, బురద నిండి భూములు పాడైన నష్టం ఎక్కువగా ఉందని పలువురు చెబుతున్నారు. ఎగువన ఉన్న మంచిర్యాల మొదలుకుని, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల దాకా వేలమంది రైతుల పరిస్థితి ఇదే. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలకు మునిగిపోయి దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో ఇసుక, బురద మేటలు వేయడంతో సాగుకు తక్షణం పనికిరాని స్థితికి చేరాయి. వీటిని తిరిగి సాగుకు సిద్ధం చేయడానికి రైతులు పెట్టాల్సిన ఖర్చులు.. పంటలకు వాటిల్లిన నష్టం కంటే చాలా ఎక్కువగా ఉంది.
మా పొలానికొస్తే.. ఉచితంగా ఇసుక..భారీవర్షాలు, వరదల కారణంగా వాగులు, వంకల్లోని ఇసుక పంటపొలాలను ముంచెత్తింది.. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోనే సుమారు 150 ఎకరాల్లో ఇలా ఇసుక మేటలు వేసింది. దాన్ని తొలగించడానికి డబ్బు లేక అనేకమంది రైతులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లమని అవసరార్థులకు చెబుతున్నారు. తంతోలి గ్రామానికి చెందిన స్వామి అనే రైతు నాలుగెకరాల్లో పత్తి వేయగా వాగు ఉద్ధృతికి ఇసుకంతా వచ్చి చేరింది. దాన్ని ఉచితంగా తీసుకెళ్లమని చెప్పగా కొందరు ట్రాక్టర్లలో తరలిస్తున్నారిలా..
పంటా పోయె.. పొలమూ మాయమాయె..అప్పులు తెచ్చి వేసిన పత్తి పంట మొలకలొచ్చాయి. సంబరపడిన రైతుల ఆశలన్నీ భారీవర్షాలతో నీటిపాలయ్యాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లింగుగూడకు చెందిన రైతు మెస్రం ఇంద్రు, పక్కనే మరో రైతు శ్యాంరావు ఆరేసి ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వాగుకు గండి పడటంతో ఆ నీరంతా మొత్తం చేనులోంచే ప్రవహిస్తోంది. రాళ్లురప్పలు మేటవేసి పంటతో పాటు పొలాన్నీ నామరూపాలు లేకుండా చేసేయడంతో రైతులు గొల్లుమంటున్నారు. సాగు కోసం చెరో రూ.2 లక్షల చొప్పున అప్పు చేసినట్లు చెబుతూ ఆవేదన చెందుతున్నారు.
మాడిపోయిన వరినారు..ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గోదావరి వరదలో మునిగి పాడైన వరినారు. కొప్పుల నాగరాజు అనే రైతు మూడెకరాల్లో వరి సాగు కోసం నారు పోయగా వరదలో మూడు రోజులు మునిగి పాడైంది. నాటు వేయడానికి పనికిరాకుండా నారు మాడిపోయిందని, మొత్తం రూ.10 వేల వరకూ పెట్టుబడి నష్టపోయినట్లు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఇలా పలుచోట్ల రైతులు పంటలు నష్టపోయారు.