తెలంగాణ

telangana

ETV Bharat / city

అడవుల జిల్లాలో హరితహారం లక్ష్యం.. 43.64 లక్షలు - adilabad district greenary

ఆదిలాబాద్ జిల్లాలో పచ్చదనం పెంచేందుకు వచ్చే ఏడాది హరితహారం లక్ష్యాన్ని ఖరారు చేశారు. దీనికోసం ఇప్పటి నుంచే నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. రాబోయే సంవత్సరంలో పూర్తి లక్ష్యం చేరుకోవాలని భావిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీ, పురపాలక శాఖలు ఎవరికి వారు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా అన్ని శాఖలకు మొక్కలు నాటే బాధ్యతలూ అప్పగించారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రణాళికలు పూర్తిచేశారు.

haritha haram program in adilabad district
అడవుల జిల్లాలో హరితహారం లక్ష్యం.. 43.64 లక్షలు

By

Published : Nov 10, 2020, 1:43 PM IST

ఆదిలాబాద్​ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నర్సరీలో 10వేల మొక్కలు పెంచాలని లక్ష్యం విధించారు. ఇందుకు సంబంధించి ఏయే రకాల మొక్కలు పెంచాలనే విషయమై పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థుల నుంచి సమచారం సేకరిస్తున్నారు. పొలం గట్లతోపాటు ఇళ్లల్లో నాటేందుకు అనువుగా ఉండే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రభుత్వ స్థలాల్లో సామూహిక వనాలు ఏర్పాటుచేసేలా మొక్కలు పెంచనున్నారు.

పల్లెలో మొక్కల పర్యవేక్షణ బాధ్యత సర్పంచులకు అప్పగించడం, సంరక్షణ కోసం సిబ్బందిని నియమించడంతో మొక్కల పెరుగుదలకు కొంత ఇబ్బంది లేకుండా మారింది. ఈ ఏడాది కరోనా కారణంగా కొన్నిచోట్ల మొక్కలు నర్సరీల్లోనే ఉండిపోయాయి. ఈ కార్యక్రమం కూడా అంతగా సాగిన దాఖలాలు కనిపించలేదు. ఇక అటవీశాఖ ఆధ్వర్యంలో రోడ్లపక్కన, ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆదిలాబాద్‌ బల్దియాలో ఈ ఏడాది భారీగా లక్ష్యం విధించగా.. అది చేరుకోవడం కష్టంగా మారింది. అవసరమైన మొక్కలు అందుబాటులో లేకపోవడంతో సుమారు 10వేల వరకు మొక్కలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పట్టణంలో సుమారు 10వరకు నర్సరీలు ఏర్పాటుచేసి మొక్కల పెంపకం చేపట్టాలని భావిస్తున్నారు.

పురపాలక నిధుల నుంచి 10శాతం తప్పనిసరిగా పచ్చదనానికి కేటాయించాల్సి ఉండటంతో నిధుల కొరత లేదు. వీటితో పాటు అన్ని శాఖలకు మొక్కలు నాటే బాధ్యతలు అప్పగించారు. స్థలాలు అధికంగా ఉండే శాఖలకు ఎక్కువ లక్ష్యం విధించగా.. కొరత ఉన్న వాటికి తక్కువగా కేటాయించారు. ఈ విషయమై డీఆర్‌డీఏ ఏపీడీ రాఠోడ్‌ రవీందర్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. రాబోయే ఏడాదికి సంబంధించి హరిత ప్రణాళిక ఖరారు చేశామన్నారు. ఇప్పట్నుంచే నర్సరీలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details