ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లో... షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. నకిలీ పత్రాలు సృష్టించి చేసిన దోపిడీపై రెవెన్యూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నిజనిర్ధరణకు పాత దస్త్రాలను పరిశీలిస్తోంది. గుడిహత్నూర్, బోథ్ మండలాల పరిధిలోని 8గ్రామాల్లోనే 24 మంది పేరిట బినామీ పత్రాలు సృష్టించి... రూ. 31 లక్షలు కాజేసిన తీరు విస్తుగొలుపుతోంది. ఈ వ్యవహారం ఈనాడు-ఈటీవీ భారత్పరిశోధనలో వెలుగుచూడటం... అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో... షాదీముబారక్, కల్యాణలక్ష్మి సెక్షన్ ఇంఛార్జ్ నదీంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సస్పెండ్ వేటు వేశారు. అన్ని మండలాల్లో పాత దస్త్రాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: అక్రమార్కులపై దర్యాప్తునకు అధికారుల సమాయత్తం - షాదీ ముబారక్ అమలులో అక్రమాలు
పేదింటికి ఆసరాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అక్రమాలు... ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో అవినీతి అధికారులు, మీ-సేవా సిబ్బంది చేతివాటం... సర్కారీ ఖాజానాకు చిల్లులు పెట్టింది. లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము... తప్పుడు బిల్లులతో అక్రమార్కుల జేబుల్లో చేరింది. ఈనాడు-ఈటీవీ భారత్ పరిశోధనలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై... పూర్తిస్థాయి దర్యాప్తునకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లో అక్రమాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ఇచ్చోడ మీ-సేవా కేంద్రాన్ని అధికారులు మూసేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆదిలాబాద్ పురపాలక సంఘం సహా ఆదిలాబాద్ గ్రామీణం, జైనథ్ మండలాల్లో... 2017 నుంచి పంపిణీ చేసిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల వివరాలు కంప్యూటర్ల ఆధారంగా పరిశీలించే ప్రయత్నం జరుగుతోంది. బోథ్, సిరికొండ, గుడిహత్నూర్‌లో అనుమానాలకు తావిచ్చేలా కొన్ని దస్త్రాలు ఉన్న నేపథ్యంలో... అధికారులు విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడం అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. శాసనసభ్యులు, ఆర్డీవోలు, తహసీల్దార్ల ఆమోదంతో పంపిణీ అయ్యే చెక్కుల్లో... బినామీ పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయనే కోణంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ఆరా తీయడం రాజకీయవర్గాల్లోనూ కలకలం సృష్టిస్తోంది.
ఇదీ చూడండి:కార్పొరేటర్‌గా ఓడినా.. ఎమ్మెల్యేలయ్యారు!