ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ బిల్లుల రీడింగ్ నమోదులో దొర్లుతున్న తప్పులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గుత్తేదారులు నమోదు చేస్తున్న మీటర్ రీడింగ్‌నూ అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. సంస్థలో టెండర్ దక్కించుకున్న గుత్తేదారు, విద్యుత్‌శాఖ సిబ్బంది నమోదు చేస్తున్న రీడింగ్ లోపాలపై 'ఈనాడు- ఈటీవీ భారత్'లో 'లెక్కతప్పుతున్న విద్యుత్ బిల్లు రీడింగ్.. ఆందోళనలో ప్రజలు' శీర్షికన కథనానికి యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రూ. 850కి తగ్గిన విద్యుత్ బిల్లు
ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ బిల్లుల పొరపాట్లపై ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. రూ. 29,838 బిల్లు వచ్చిన వ్యక్తి వివరాలను పరిశీలించి... అతనికి పొరపాటుగా అంత బిల్లు వచ్చినట్లు గుర్తించి.. సగటున వచ్చే రూ. 850 విలువైన కరెంట్ వాడినట్లు నిర్ధరించారు.
తప్పులు చేస్తే ఉపక్రమించేది లేదని స్వయంగా ఆ శాఖ ఎస్ఈ ఉత్తమ్‌కుమార్ జాడే స్పష్టం చేయగా బిల్లింగ్ నమోదు చేసే సిబ్బందిలో ఆందోళన మొదలైంది. జందాపూర్ గ్రామానికి చెందిన యువకుడికి స్వయంగా ఫోన్ చేసిన సిబ్బంది బిల్లులను తెప్పించుకున్నారు. ఎలాంటి పాత బకాయిలు లేని అతనికి రూ.29,838 బిల్లు పొరపాటుగా వచ్చినట్లు గుర్తించి దానిని రూ. 850 బిల్లుగా నిర్ధరించారు. నెలరోజుల నుంచి సిబ్బంది చుట్టూ తిరిగినా స్పందించలేదని.. ఈనాడు- ఈటీవీ భారత్ కథనంతో సమస్య పరిష్కారమైందని బాధితుడు రాజేశ్ ఆనందం వ్యక్తం చేశారు.