ఆదిలాబాద్‌లో చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమంలో చివరి రోజున వివాదం చోటుచేసుకుంది. పట్టణప్రగతి పనుల్లో భాగంగా వార్డు సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ డేవిడ్... పురపాలకపరిధిలోని ఖానాపూర్ చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు ఆక్రమణకు గురికావటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై.. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్‌ను ప్రశ్నించారు. చెరువులోకి నీళ్లు వచ్చే నాలాలో చెత్తను వేయటం... అదే చెరువులో మట్టి వేస్తూ... కబ్జా చేయటంపై నిలదీశారు. కబ్జాలను అడ్డుకోవాల్సింది పోయి స్వయంగా ఆక్రమణలకు పాల్పడటం ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.
అధికారికి, అధికార ప్రతినిధికి మధ్య వివాదం... ఆక్రమణే కారణం..! - adilabad latest news
ఆదిలాబాద్‌లో జరుగుతున్న పట్టణప్రగతి వివాదానికి కేంద్ర బిందువైంది. కార్యక్రమంలో భాగంగా వార్టు సందర్శనకు వచ్చిన అడిషనల్ కలెక్టర్‌కు, వైస్‌ఛైర్మన్ మధ్య ఆక్రమణల విషయంలో మాటామాటా పెరిగి వివాదానికి దారి తీసింది. చెరువు అక్రమణకు గురవటం పట్ల వైస్ ఛైర్మన్‌ను అధికారి నిలదీయటం.. చర్చనీయాంశమైంది.
![అధికారికి, అధికార ప్రతినిధికి మధ్య వివాదం... ఆక్రమణే కారణం..! dispute between additional collector and municipal vice chairman at adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12416100-843-12416100-1625916773237.jpg)
ఈ కబ్జా వ్యవహారానికి బాధ్యత వహిస్తూ... ఆక్రమణలను తొలగించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించగా... జహీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు నిందిస్తున్నారని అడిషనల్ కలెక్టర్‌ను జహీర్ ఎదురు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రాంతంలో ఇలా జరుగుతుంటే... అడ్డుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉంటుందని డేవిడ్ తెలిపారు. నాలాలో చెత్త వేస్తే నీళ్లు ఎటు వెళ్తాయని.. చెరువులో మట్టి వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ... ఇద్దరికీ నచ్చజెప్పి సముదాయించారు.
ఆక్రమణలపై దృష్టి...
వైస్ ఛైర్మన్ తీరుపైన అడిషనల్ కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు బాధ్యున్ని చేయటం పట్ల అధికారిపై వైస్ ఛైర్మన్ గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద ఓ అధికారి, అధికారపార్టీ నేతకు మధ్య... ఆక్రమణల వ్యవహారంపై వివాదం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలపై అడిషనల్ కలెక్టర్ దృష్టిసారించడం ప్రస్తుతం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.