జిల్లా గులాబీ దళంలో మునుపెన్నడూ లేని విధంగా అసంతృప్తి రాజుకుంటోంది. నేతల మధ్య అంతరం పెరుగుతోంది. పునర్విభజన తరువాత ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు (ఉట్నూర్, ఇంద్రవెల్లి), ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు (నార్నూర్, గాదిగూడ)లతో నూతన జిల్లా అవతరించింది. రెండోసారి శాసనసభ ఎన్నికల అనంతరం నేతల మధ్య రాజకీయ వైరం పెరిగింది.
నువ్వా.. నేనా అన్నట్లుగా..బోథ్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లోనే ఆధిపత్య పోరు స్పష్టంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు వర్గానికి రాష్ట్ర డెయిరీ మాజీ ఛైర్మన్ లోకభూమారెడ్డి, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్‌లతో కలిపి మాజీ ఎంపీ గోడం నగేష్ మరో వర్గంగా కొనసాగుతున్నారు. బోథ్ మండలంలో ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాల పరంపర మూడునెలల కిందటనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కుదిపేసింది. తాజాగా ప్రభుత్వం ఖరారుచేసిన కొత్తమండలాల జాబితాలో సొనాల ప్రస్తావన లేకపోవడంతో బోథ్ తెరాసలో మరోసారి అసంతృప్తి రాజుకుంది. ఎమ్మెల్యే బాపురావు అడ్డుకోవడంతోనే సొనాల మండలం ఏర్పాటు కాలేదని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. సొనాల కేంద్రంగా నిరసనలు, వంటావార్పు, అక్టోబరు 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రకటించడం రాజకీయ వ్యూహంలోని భాగమేనని ఎమ్మెల్యేవర్గం పేర్కొంటోంది. తాజాగా గురువారం తుల శ్రీనివాస్ తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే బాపురావు అనుచరుడైన నేరడిగొండకు చెందిన బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దావుల భోజన్న బోథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయ వైరాన్ని బహిరంగపర్చింది. ఎంపీపీ తులశ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దావుల భోజన్న ఒకే పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలైనా సఖ్యత చేకూర్చే ప్రయత్నం జరగడంలేదు.